ప్రమాదం కాదు.. హత్యే | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం కాదు.. హత్యే

Apr 10 2025 12:23 AM | Updated on Apr 10 2025 12:23 AM

ప్రమాదం కాదు.. హత్యే

ప్రమాదం కాదు.. హత్యే

జమ్మలమడుగు రూరల్‌ : బంధువుల మధ్య చిన్న తగాదే చిలికి చిలికి గాలి వానగా మారింది. అది చివరకు హత్యకు దారి తీసింది. అయితే దానిని ప్రమాదంగా చిత్రీకరించాలని బంధువులు ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. జమ్మలమడుగు పట్టణ సీఐ ఎస్‌.లింగప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామం రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన బట్టు కిషోర్‌ బాబు (33) అనే యువకుడు మార్చి 24వ తేదీ జమ్మలమడుగు నుంచి స్వగ్రామమైన గూడెంచెరువుకు తన బైక్‌లో వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బట్టు కిషోర్‌ భార్య పుష్పవతి జమ్మలమడుగు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. కిషోర్‌ బాబుకు అన్న వరుస అయిన దేవరపల్లి ఉదయ్‌ కుమార్‌ ప్రొద్దుటూరు పట్టణంలోని కొట్టాలలో ఉంటున్నాడు. మార్చి 20వ తేదీన తన మేన మామ అయిన కిరణ్‌ తల్లి చనిపోయి 11 రోజులు కావడంతో దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన ఉదయ్‌ కుమార్‌ను చిన్న విషయమై కిషోర్‌ బాబు అందరి ముందు మందలించాడు. అంతే కాకుండా ఉదయ్‌ కుమార్‌ భార్యపై కిషోర్‌ బాబు చేయి చేసుకున్నాడు. దీనిని అవమానంగా భావించిన ఉదయ్‌ కుమార్‌ ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 23వ తేదీన తాను డ్రైవర్‌గా వెళ్లే ఏపీ39–యుకె–3392 నెంబర్‌ గల ఐచర్‌ వాహనంలో జమ్మలమడుగు బైపాస్‌రోడ్డుకు వచ్చాడు. అక్కడి నుంచి కిషోర్‌ బాబుకు ఫోన్‌ చేసి నీ కథ ఈ రోజు తేలుస్తానని బెదిరించాడు. కిషోర్‌ బాబు మోటార్‌ బైకులో పట్టణంలోని ముద్దనూరు రహదారి గుండా వెళుతుండగా ఐషర్‌ లారీతో వెనుక వైపు నుంచి కిషోర్‌ బాబు బైకును ఢీకొని వాహనంతో పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించిన పోలీసులు నిందితుడు ఉదయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే వాహనంతో ఢీ కొట్టి చంపినట్లు అంగీకరించాడు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

లారీతో ఢీ కొట్టి హత్య

బంధువుల మధ్య తగాదే కారణం

పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement