సబ్‌స్టేషన్ కోసం పేదల ఇళ్లు కూల్చివేత
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగరం మృత్యుంజయకుంట సూర్య ఆస్పత్రి సమీపంలో గత 30 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గతంలో కూలగొట్టిన విద్యుత్ అధికారులు ఇప్పుడు ఆ స్థలంలో సబ్‌స్టేషన్ నిర్మించేందుకు చదును చేస్తున్నారని బాఽధిత ప్రజలు వాపోతున్నారు. కడప నాగరాజుపల్లె గ్రామ పొలం సర్వే నెంబరు 187/1లో ఉన్న ఈ స్థలంలో రెవెన్యూ అధికారులు చాలాకాలం క్రితమే కొందరికి నివేశన స్థల స్వాధీన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ అనుబంధ పత్రాలు పొందిన పేదలు ఆ స్థలంలో చిన్నచిన్న రేకులషెడ్లు నిర్మించుకున్నారు. క్రమం తప్పకుండా మున్సిపాలిటీకి ఇంటి పన్ను, కుళాయిపన్నుతోపాటు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ వారు చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ తమకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించుకునేందుకు స్థలం కావాలంటూ రెవెన్యూ అధికారులను కోరారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రస్తుతమున్న పీడబ్ల్యు ఓవర్ లోడుతో పనిచేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. కనుక తమకు సబ్‌స్టేషన్ కోసం స్థలం కేటాయించాలని కోరగా, అప్పటి కలెక్టర్ విజయరామరాజు సదరు సర్వే నెంబరులోని 20 సెంట్ల స్థలాన్ని ఏపీఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్‌కు కేటాయిస్తూ గత సంవత్సరం జులై 18న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో విద్యుత్ అధికారులు వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లు ఎలా కూల్చివేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో తాత్కాలికంగా విద్యుత్ అధికారులు వెనక్కి తగ్గారు. ఈనెల 6వ తేదీ శ్రీరామనవమి రోజు స్థలం వద్దకు వచ్చి అక్కడ పేదలు ఏర్పాటు చేసుకున్న బోర్డును తొలగించి స్థలాన్ని చదును చేశారు. దీనిపై బాధితులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. ఇదే సర్వే నెంబరులో తమకు కేటాయించిన 20 సెంట్ల స్థలమే కాకుండా మరో ఎకరా ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలంలో సబ్‌స్టేషన్ నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని బాధితులు అంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తమ పట్టా స్థలంలో తాము ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వని అధికారులు
పరిహారం సైతం లేకుండానే స్థలం చదును
లబోదిబోమంటున్న బాధితులు


