టీడీపీ నేతలది రాక్షసానందం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలది రాక్షసానందం

Apr 10 2025 12:23 AM | Updated on Apr 10 2025 12:23 AM

టీడీపీ నేతలది రాక్షసానందం

టీడీపీ నేతలది రాక్షసానందం

కడప కార్పొరేషన్‌ : అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా సోదరుడు అహ్మద్‌బాషాను ఇటీవల అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి బుధవారం ఆయన అంజద్‌బాషా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే మాధవి రాక్షసానందం పొందడంలో భాగంగానే ఈ అరెస్ట్‌ జరిగిందన్నారు. అది 2022లో పెట్టిన చిన్నకేసు అని, అందులో ఉన్న బెయిలబుల్‌ సెక్షన్లను ఇప్పుడు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లుగా మార్చి అరెస్ట్‌ చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎవరైతే కేసు పెట్టారో వారు తమ పార్టీలోనే ఉన్నారని, తాము రాజీ అవుతున్నట్లు కోర్టులో పిటిషన్‌ కూడా వేశారన్నారు. ఆ కేసులో పోలీసులు అత్యుత్సాహంతో లక్షలు ఖర్చుపెట్టి ముంబైకి వెళ్లి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. ముంబైకి వెళ్లి అరెస్ట్‌ చేసేంత పెద్ద కేసా ఇది...ప్రజలంతా ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను విపరీతంగా వేధిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన హోటళ్లు, ఆఫీసులు, వాటర్‌ప్లాంట్లను కూల్చివేస్తున్నారన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించాల్సిన డీఆర్‌సీ మీటింగ్‌లో వీటిపైనే చర్చ చేస్తూ తర్వాతి మీటింగ్‌లో యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు అంటూ మొదటి అంశంగా దానిపైనే కలెక్టర్‌, ఎస్పీలు చర్చిస్తున్నారంటే ఎంత అప్రజాస్వామికంగా పాలన నడుస్తోందో తెలుస్తోందన్నారు. పోలీసులు ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతా లు తీసుకుంటున్నారో, టీడీపీ కార్యాలయం నుంచి అందుకుంటున్నారో ఆలోచించాలన్నారు. అహ్మద్‌బాషాను అన్యాయంగా అరెస్ట్‌ చేస్తే 30యాక్టు అమల్లో ఉన్నా లెక్కచేయకుండా టీడీపీ నాయకులు పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకోవడం వారి రాక్షసానందానికి పరాకాష్ట అని మండిపడ్డారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకోవడానికి వాళ్లేమైనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చారా ...లేక.. కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చారా అని ఎద్దేవా చేశారు. 30 యాక్టును ఉల్లంఘించి బాణాసంచా పేల్చారని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ కట్టలేదని, కనీసం రశీదు కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించే విషయంలో, టీడీపీ నాయకుల అక్రమ వ్యాపారాలను చక్కబెట్టే పనిలో ఎస్‌ఐలు, సీఐలు చాలా బిజీగా ఉన్నారన్నారు. బుద్ధి ఉన్నవారు ఎవ్వరూ మేయర్‌ ఇంటి వద్ద చెత్త వేయరని, మేయర్‌ సురేష్‌ ఎలాంటి వ్యక్తో ఎమ్మెల్యే మాధవి చెప్పక్కర్లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

● 8 మంది ఎస్‌ఐలు, నలుగురు సీఐలు, 15 మంది కానిస్టేబుళ్లు ముంబైకి వెళ్లి ఒక తీవ్రవాదిని అరెస్ట్‌ చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు అహ్మద్‌బాషాను అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతి పరులపై లేనిపోని కేసులు, దొంగకేసులు, ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పోలీసులు, అధికారులు ఈ ప్రభుత్వాన్ని నమ్మి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

● వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మేయర్‌ సురేష్‌ బాబు మండిపడ్డారు. ఈ చర్యకు పాల్పడ్డ వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు.

● టీడీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించడానికేనా ప్రజలు మీకు అధికారమిచ్చింది అని ప్రశ్నించారు. తమకు పరువుకు నష్టం కలిగేలా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పులి సునీల్‌, పి. జయచంద్రారెడ్డి, సుభాన్‌బాషా, బీహెచ్‌ ఇలియాస్‌, యానాదయ్య, సీహెచ్‌ వినోద్‌, దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement