టీడీపీ నేతల అండతోనే శ్రీ మాధవ ఆంజనేయస్వామి భూముల ఆక్రమ
కడప రూరల్ : మైదుకూరులోని శ్రీ మాధవ ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన విలువైన భూముల ఆక్రమణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల అండదండలు ఉన్నాయని చాపాడు మండలం పెద్ద చీపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్‌ఆర్ రాజారామిరెడ్డి ఆరోపించారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైదుకూరులో శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్ధానానికి విలువైన భూములు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ స్థలాల్లో అక్రమంగా ఇద్దరు భవనాలు నిర్మించారని, మరో 17 మంది వరకు డాబాలు, షెడ్‌లు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆక్రమణదారులకు స్థానిక టీడీపీ బడా నేతల అండదండలు ఉన్నాయని తెలిపారు. ఆక్రమణలపై పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల తిరుపతి దేవదాయ శాఖకు చెందిన అధికారుల వచ్చి సర్వే చేసి, ఆక్రమణలను నిర్ధారించారని పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన ఆక్రమిత కట్టడాలని తొలగించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారన్నారు. టీడీపీ నేతల కారణంగా ఆ ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి శ్రీ మాధవ ఆంజనేయ స్వామి ఆస్తులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.


