మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్‌

Apr 11 2025 1:27 AM | Updated on Apr 11 2025 1:27 AM

మాజీ

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్‌

కడప కార్పోరేషన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లెలోని ఆయన నివాసంలో ఇటీవల జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికై న ముత్యాల రామగోవిందురెడ్డి కలిశారు. జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఆయన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో జెడ్పీ చైర్మన్‌ తనయుడు ముత్యాల శ్రీనివాసులరెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, దువ్వూరు మాజీ జెడ్పీటీసీ గుడిపాడు బాబు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లె సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లాకు చెందిన తెన్నేటి వీరబ్రహ్మయ్య (65) అనే వ్యక్తి మృతి చెందాడు. మైదుకూరు – బద్వేలు రహదారిలోని గోపిరెడ్డిపల్లె వద్ద సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బద్వేలు వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుని బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా పెసరవాయి గ్రామానికి చెందిన వీరబ్రహ్యయ్య గ్రామంలోనే పురోహితుడుగా పనిచేస్తున్నాడు. ప్రొద్దుటూరులో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన అక్కడ నుంచి స్వయంగా కారు నడుపుకొంటూ బద్వేలుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌ సిబ్బంది కారులో ఇరుక్కుపోయిన వీరబ్రహ్మయ్య మృతదేహాన్ని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య మల్లేశ్వరమ్మ, వివాహితులైన ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మైదుకూరు అర్బన్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బస్సును ఢీకొని

యువకుడి మృతి

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరివెళ్ల గురుదత్‌ (20) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామం రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన సిరివెళ్ల గురుదత్‌ సొంత పనుల నిమిత్తం పట్టణానికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బైక్‌లో వెళుతుండగా మార్గమధ్యంలోని పతంగే రామన్నరావు ప్రభుత్వ హైస్కూల్‌ సమీపంలో జమ్మలమడుగు నుంచి ముద్దనూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ సంఘటనలో గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. గురుదత్‌ తండ్రి సిరివెళ్ల రాఘవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కత్తితో భయపెట్టి

బంగారు గొలుసు లాక్కెళ్లాడు

సింహాద్రిపురం : ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో భయపెట్టి ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సింహాద్రిపురం మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. సింహాద్రిపురం మండలం బలపనూరులో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న వంగల సుధేష్ణ నక్కలపల్లె గ్రామంలో నివాసముంటోంది. మధ్యాహ్నం విధులు ముగించుకుని తన స్కూటీపై బలపనూరు నుంచి నక్కలపల్లెకు వెళుతుండగా.. నక్కలపల్లె గ్రామం నుంచి ఎదురుగా బైకుపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అటకాయించాడు. కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న మూడు తులాలపైబడిన బంగారు గొలుసును లాక్కుని బైకుపై పులివెందుల వైపు పారిపోయాడు. అనంతరం ఆమె నక్కలపల్లె గ్రామానికి వెళ్లి భర్త జనార్దన్‌రెడ్డికి విషయం తెలపడంతో ఇరువురు సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రమోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను  కలిసిన జెడ్పీ చైర్మన్‌   1
1/2

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్‌

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను  కలిసిన జెడ్పీ చైర్మన్‌   2
2/2

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement