గంజాయి మత్తులో మైనర్లు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఇప్పటికే సోషల్ మీడియా ఊబిలో పడి చిత్తవుతున్న యువత.. గంజాయి మత్తుకూ బానిసవుతున్నారు. కాలేజీ కుర్రాళ్లే కాదు.. స్కూల్ పిల్లలు సైతం ఈ మత్తులో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా కొందరు యువత, మైనర్లతో ‘ఇన్‌స్ట్రాగామ్’లో గ్రూపులు కట్టి, చాటింగ్‌లు చేస్తున్నారు. ఇదేదో మంచి అలవాట్లకు, యువతకు ఉపయోగపడే విధంగా ఉంటే పర్వాలేదు. గంజాయి మత్తుకు అలవాటుపడేలా మైనర్ బాలురను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రూప్‌లో 14 ఏళ్ల బాలుడు గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడు. అంతేనా.. తన పుట్టినరోజు వేడుకను ధూంధాంగా జరుపుకుని లక్షలాది రూపాయలను ఖర్చుచేసి జల్సాలకు పాల్పడ్డాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్న పొడవాటి, వివిధ డిజైన్‌లతో ఉన్న కత్తిని పట్టుకుని ఏకంగా ఫొటోకు ఫోజులిచ్చి మైనర్లను ఆకర్షించసాగాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీస్ సబ్ డివిజనల్ అధికారితో సైతం సెల్ఫీ ఫొటో దిగాడు. స్నేహం కొద్దీ, స్ఫూర్తి కోసమో ఆ పోలీసు అధికారి సెల్పీ తీసుకోవడానికి అనుమతిస్తే, ఆ బాలుడు ఆ సెల్ఫీ ఫోటోను తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా చాటింగ్‌కు ఉపయోగిస్తూ, మిగతా ‘మైనర్ల’దృష్టిలో ‘బాస్’గా మారిపోయాడు. ఈ క్రమంలో తనచేత ఆకర్షించబడిన బాలురను కత్తితో, తన చేష్టలతో బెదిరించి ఓ మైనర్ బాలుడి ఇంటి నుంచి పలు దఫాలుగా దాదాపు 8 తులాల బంగారు ఆభరాలను తెప్పించుకుని ఎంచక్కా తాను, తన గ్రూప్ సభ్యులతో జల్సాలకు పాల్పడ్డాడు. ఈవ్యవహారమంతా గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో చోటుచేసుకుంది. ఆ సమయంలో బాధిత బాలుడి తండ్రి కువైట్‌లో ఉన్నాడు. ఇటీవల కడపకు వచ్చి బంగారు ఆభరణాల గురించి ఆరా తీశారు. ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఓ మైనర్ బాస్‌కు తమ కుమా రుడు దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లి ఇచ్చినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ‘డబుల్‌స్టార్’ తనపాటికి తాను విచారణ చేసేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులమంటూ ఇద్దరు వ్యక్తులు అడ్డుకుంటున్నట్లు సమాచారం.
● మత్తు పదార్థాల నివారణ కోసం పోలీసులు నిఘా కార్యక్రమాలను చేపట్టినా చాపకింద నీరులా గంజాయి మత్తు విస్తరిస్తూనే ఉండడం విచారకరం. ఇప్పటికైనా పోలీసు ఉన్న తాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇంట్లోని బంగారు ఆభరణాలను సైతం దోచిపెడుతున్న వైనం..
కడపలో రెండవ ప్రధాన స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే సాక్ష్యం


