వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం
కడప కల్చరల్: ముస్లింల హక్కుల పరిరక్షణను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాడుతామని, అవసరమైతే సుదీర్ఘ ఉద్యమానికి వెనుకాడేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం స్థానిక ఏడురోడ్ల కూడలిలో ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై నల్లచట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంజద్‌బాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను దుయ్యబట్టారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లులకు ఏయే పార్టీల వారు మద్దతు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. ముస్లింలకు మద్దతుగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని నాయకులు వెంటనే రాజీనామాలు చేసి నల్లచట్టాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. సెక్యులర్ భావాలు గల ప్రతి పౌరుడు ఈ చట్టాలను తీవ్రంగా నిరసించాలన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ దేశంలో ముఖ్య భాగమైన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఈ ఒక్కరోజు చేస్తే సరిపోదని, సమస్య పరిష్కారం అయ్యేవరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ముస్లింలందరూ తమలోని విబేధాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నిరసన ప్రదర్శనలో నల్లజెండాలతోపాటు నల్లరిబ్బన్లు, జాతీయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత గురువులు, ముస్లిం ప్రముఖులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు, ఉలేమా అయిమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు సుబాన్‌బాషా, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజమ్, డాక్టర్ గౌస్‌పీర్, డీసీసీ మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నేత అలీఖాన్, ధర్మ ప్రచారకులు బాబుభాయ్, సంఘ సేవకులు సలావుద్దీన్, కాల్‌టెక్స్ హఫీజుల్లా, మైనార్టీ కార్పొరేటర్లు, నగర ముస్లింలు పాల్గొన్నారు.
సుదీర్ఘ ఉద్యమానికి వెనుకాడబోము
ముస్లింల నిరసన ప్రదర్శనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా
వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం


