ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
గోపవరం : మండలంలోని పి.పి.కుంట సమీపంలో ఉన్న సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఎదురుగా నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ నరసయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బద్వేలు నుండి పి.పి.కుంట వైపు వెళుతున్న ట్రాక్టర్ సెంచురీ పానెల్స్ వద్ద ఉన్న పెట్రోలు బంకులో డీజిల్ పట్టించుకునేందుకు తిప్పుతుండగా అదే సమయంలో నెల్లూరు వైపు నుండి అతి వేగంగా వస్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన నరసయ్యను ఆసుపత్రికి తరలించేందుకు గోపవరం అంబులెన్స్‌కు సమాచారమివ్వగా వాహనం మరమ్మతుకు నోచుకోవడంతో అందుబాటులోకి రాలేదు. అదే విధంగా బద్వేలు అంబులెన్స్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు తీవ్రంగా గాయపడిన నరసయ్య రోడ్డు మీదనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో సెంచురీ పానెల్స్ పరిశ్రమ అంబులెన్స్ ద్వారా తీవ్రంగా గాయపడిన నరసయ్యను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. కాగా పి.పి.కుంట, ప్రాజెక్టుకాలనీ–1, సెంచురీ పానెల్స్ పరిశ్రమ ఎదురుగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రమాద జోన్‌గా గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని పరిశ్రమ నిర్వాహకులతో పాటు వాహనదారులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


