కత్తితో బెదిరించి గాజులు లాక్కెళ్లాడు
కొండాపురం : మండల కేంద్రంలో పట్టపగలు ఓ గుర్తు తెలియని వ్యక్తి గోరుశెట్టి రంగమ్మ అనే వృద్ధురాలిని కత్తితో బెదిరించి రెండు గాజులు లాక్కెళ్లాడు. ఎస్‌ఐ ఎం. ప్రతాప్‌రెడ్డి వివరాల మేరకు కొండాపురం ఎస్‌బీఐ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని రంగమ్మ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి కత్తితో ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె చేతికి ఉన్న రెండు గాజులు తీసి ఇచ్చింది. అయితే అవి బంగారు గాజులు కావని రోల్డ్‌గోల్డ్‌వి అని వాటి విలువ రూ. 450 ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
అట్లూరు : పొలం గట్లపై ఉన్న కంపను కాల్చేందుకు ఓ రైతు పెట్టిన నిప్పుతో మంటలు చెలరేగి పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని పాత అట్లూరు గ్రామ సమీపంలో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలో ఉన్న పొలాల గట్లపై ఉన్న ముళ్ల కంపను కాల్చేందుకు రైతు నిప్పు పెట్టారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంటలు ఎగిసి పడుతూ గ్యాస్ గోడౌన్ వైపు వ్యాపించాయి. గ్రామస్తులు అందరూ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాక పోవడంతో బద్వేలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అగ్ని మాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేయడంతో హమ్మయ్యా.. అంటూ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన
రేషన్ బస్తాలు సీజ్
దువ్వూరు : దువ్వూరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బస్తాలను కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ప్రొద్దుటూరు సివిల్ సప్‌లై డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున ఆధ్వర్యంలో దాడులు చేసి సీజ్ చేశారు. మండలంలోని కానగూడూరు గ్రామం అంగన్‌వాడీ కేంద్రం పక్కన వాటర్ ట్యాంక్ వెనుక రేకుల షెడ్డులో కలరి సుబ్రహ్మణ్యం అక్రమంగా నిల్వ ఉంచిన 35 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.80,500 ఉంటుందన్నారు. బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించి కేసు నమోదు చేశామన్నారు. అలాగే పోతురాజు మహాలింగం దువ్వూరు అశోక్ నగర్ వీఽధిలో ఓ పాడుబడిన ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.1,71,580 అని చెప్పారు. తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరకు హోటళ్లకు అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
కమలాపురంలో చోరీ
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని కె. అప్పాయపల్లెలో చోరీ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అప్పాయపల్లెకు చెందిన బోయిళ్ల నాగ మల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఉన్న తన కొడుకు వద్దకు వెళ్లారు. కాగా శుక్రవారం అర్థరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు ఇంటి వాకిలికి ఉన్న గడియను పగుల గొట్టి లోనికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు నగలు అపహరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఇరుగు పొరుగు వారు చూడగా తలుపు తెరిచి ఉండటంతో పాటు తలుపుకున్న గడియ పగులగొట్టడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఘటన జరిగిన ఇంటికి పరిశీలించారు. క్లూస్ టీం వస్తుందని పోలీసులు చెప్పడంతో ప్రజలు ఎవరూ ఇంట్లోకి వెళ్లలేదు. ఈ విషయంపై ఎస్‌ఐ విద్యా సాగర్‌ను వివరణ కోరగా బాధితులు హైదరాబాద్‌లో ఉన్నారని, వారు వచ్చి ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
నీట మునిగి ఉపాధ్యాయుడి మృతి
పీలేరు : తన కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగింది. నందకుమార్(50) అనే ఉపాధ్యాయుడు కేవీపల్లె మండలం మారెళ్ల పడమట పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. శనివారం తన కుమారుడికి ఈత నేర్పించడానికి పట్టణ సమీపంలోని చెక్‌డ్యామ్ నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడే చనిపోయారు.
కత్తితో బెదిరించి గాజులు లాక్కెళ్లాడు


