కాయ..కష్టం.. నేలపాలు!
కడప అగ్రికల్చర్/చక్రాయపేట: ఈ ఏడాది మామిడి రైతులు ఆశలు అడియాసలయ్యాయి. మొదల్లో మామిడి చెట్లకు పూత బాగానే ఉన్నా ఎండల తీవ్రత పెరగడంతో తెగుళ్లు సోకి చెట్లకున్న పూతంత రాలిపోయింది. పైగా అక్కడక్కడ పిందలు కూడా నేల రాలిపోతున్నాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి ఆశలు కుప్పకూలి పోయాయి. మామిడికి తెగుళ్లు తీవ్రత అధికంగా ఉండటంతో వేలకు వేలు ఖర్చు పెట్టి పురుగుమందులను పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాలకు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందని కానీ దిగుబడి చూస్తే వేలల్లో కూడా వచ్చేలా లేదని మామిడి రైతులు ఆందోళనలు చెందుతున్నారు.
జిల్లాలో 9642 ఎకరాల్లో...
జిల్లావ్యాప్తంగా 9642 ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. ఇందులో అత్యధికంగా చక్రాయపేట మండలంలో 3498.48 ఎకరాల్లో సాగులో ఉండగా సిద్దవటంలో 1744.25 ఎకరాల్లో, వేంపల్లిలో 680 ఎకరాల్లో, సీకేదిన్నె మండలంలో 356 ఎకరాల్లో ఇలా జిల్లావ్యాప్తంగా 35 మండలాల్లో కలిపి 9642 ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. వాతావరణ మార్పులతోపాటు రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో తెగుళ్ల బెడద అధికమయింది. ముఖ్యంగా పేనుబంక తెగులు అధికంగా ఉంది. వాటికి మందులు వాడినా ఫలితం అంతగా లేదని రైతులు తెలిపారు. ఎండలు తీవ్రత పెరిగే కొద్ది క్రమేపి పూత రాలి పోయిందని పలువురు రైతులు బాధ వ్యక్తం చేశారు.
ఇతని పేరు మధుసూదన్‌రెడ్డి. చక్రాయపేట మండలం సురభి గ్రామం. 20 ఎకరాల్లో మామిడిని సాగు చేశాడు. ఈ ఏడాది మామిడి తోటకు దోమపడి పూత బాగా తగ్గింది. దాని నివారణకు దాదాపు ఆరు లక్షల రుపాయ లు ఖర్చు చేసి మందులు పిచికారి చేశాడు. ఫలితం లేదు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేద ని దిగాలు పడుతున్నాడు. జిల్లాలో చాలా మంది రైతుల పరిస్థితి దయనీయంగానే ఉంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈ ఏడాది వాతావరణ మార్పులతోపాటు ఎండల తీవ్రతతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.ఎకరాలకు 70 నుంచి 80 వేల దాకా పెట్టుబడులు పెట్టా. తీరా దిగుబడి చూస్తేనేమో అంత పరిస్థితి లేదు. చేసిన అప్పులు కూడా తీరే పరిస్థితి లేదు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – మల్లికార్జున, కుప్పకూటపల్లె,
చక్రాయపేట మండలం.
ఉన్నపంటను కాపాడుకోవాలి
ఎండల తీవ్రతతో రాలిపోగా మిగిలిన పూత, పిందెలను కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో చెట్టుకు నీటి తడులు అందించడంతోపాటు సత్తువలను సకాలంలో అందించాలి.
– డాక్టర్ వీరయ్య, సీనియర్ శాస్త్రవేత్త,
కృషి విజ్ఞాన కేంద్రం, ఉటకూరు
ఎండలు, తెగుళ్లతో రాలిపోయిన మామిడి పూత
అధిక ఉష్ణోగ్రతలే కారణమంటున్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది భారీగా తగ్గనున్న మామిడి దిగుబడులు
ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నల వినతి
కాయ..కష్టం.. నేలపాలు!
కాయ..కష్టం.. నేలపాలు!
కాయ..కష్టం.. నేలపాలు!


