వైభవంగా కమలాపురం ఉరుసు
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రధాన ఉరుసు మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిగింది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు రాష్ట్ర నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాట క, కేరళ రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా ఆవరణం కిటకిటలాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్‌లు సమర్పించి చదివింపులు చేశారు. పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, తదితర రంగుల రాట్నాల వద్ద పిల్లల సందడి కనిపించింది.
● కమలాపురం పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకొని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీ ఆద్యంతం అలరించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్‌బీ బ్రదర్స్, యూపీ కి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ ఉత్సాహ భరితంగా సాగింది. ఖవ్వాలి ప్రేమికులు ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు.
వైఎస్సార్ సీపీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు
కమలాపురంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం రాత్రి దర్గా కన్వీన ఇస్మాయిల్ ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారి మజార్లపై చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు నాయకులు రాకను పురస్కరించుకుని ఇస్మాయిల్ దర్గా మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం పీఠాధిపతి వారిని సన్మానించారు. ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భక్తులతో కళకళలాడిన దర్గా ప్రాంగణం
అలరించిన ఖవ్వాలీ పోటీ
వైభవంగా కమలాపురం ఉరుసు


