వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యమం
కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాం. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. దీంతో ఆందోళన కార్యక్రమాలు, సమ్మె ద్వారా హక్కులను సాధించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు అన్నారు. ఆదివారం స్థానిక కింగ్స్ ఫంక్షన్ హాలులో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం (పీహెచ్‌ఎంఈయూ) జిల్లా, జోనల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్కార్‌రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇతర శాఖల విధులు ఆటంకంగా మారాయన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె ద్వారా హక్కులను సాధించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎర్రపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శిగా ఎస్‌ఎండీ మహబూబ్‌బాషా, కోశాధికారిగా జనార్దన్‌బాబు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్ బాబు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు టీ.డీ.కే సాగర్, ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
పీహెచ్‌ఎంఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఆస్కార్‌రావు


