బంగారు దుకాణంలో చోరీ
ఖాజీపేట : ఖాజీపేట బస్టాండ్‌లోని బంగారం దుకాణంలో చోరీ సంఘటన పెద్ద సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే చోరీ జరగడం, అలాగే దుకాణంలో 10 కేజీల వెండితోపాటు 20 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఖాజీపేట బస్టాండ్ కూడలిలో వీఎస్ బంగారం దుకాణం ఉంది. ఈ దుకాణం ఖాజీపేట పోలీస్ స్టేషన్‌కు 50 మీటర్ల పరిధిలోనే ఉంది. ఉదయం 6 గంటల సమయంలో బస్టాండ్‌కు వచ్చిన వారు బంగారం దుకాణం తెరిచి ఉండటం గమనించి దుకాణం బోర్డు పై ఉన్న నెంబర్ ఆధారంగా దుకాణం యజమాని అయిన వాహిద్‌కు సమాచారం ఇచ్చారు.
సీసీ కెమెరాలలో దొంగల ఆనవాళ్లు..
బస్టాండ్ కూడలిలో ఉన్న బంగారం దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. దుకాణం ఆనుకుని ఉన్న మరో దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి చూడగా అందులో చోరీ సంఘటన దృశ్యాలు కనిపించాయి. చోరీ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1 గంట నుంచి 1:45 నిమిషాల మధ్య జరిగినట్లు కనిపించింది. చోరీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నారు. అందరూ ముఖానికి పూర్తిగా ముసుగు ధరించి ఉన్నారు. కళ్లు కనిపించకుండా అద్దాలు పెట్టుకున్నారు. చేతి గుర్తులు పడకుండా గ్లౌజ్‌లు వేసుకున్నారు. ఒకరు ఎవ్వరైనా వస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నారు. మరో ఇద్దరు పెద్ద రాడ్ సహాయంతో దుకాణం బయట ఉన్న బీగం పగుల కొట్టారు. లోన ఉన్న చిలుకును రాడ్ సహాయంతో తొలగించి దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. దుకాణంలోని రెండు సీసీ కెమెరాలను తొలగించిన అనంతరం దుకాణంలోని వెండి వస్తువులు, బంగారం చోరీ చేశారు.
10 కేజీల వెండి చోరీ..
దుకాణం మూసి ఇంటికి వెళ్లేటప్పుడు దుకాణంలోని బంగారంతోపాటు నగదును తీసుకు వెళుతుంటారు. వెండి ఆభరణాలు మరమ్మతులకు వచ్చే బంగారం దుకాణంలో ఉంచి వెళుతుంటారు. అలా వదిలి వెళ్లిన వెండి సుమారు 10 కేజీలు, అలాగే 20 గ్రాముల బంగారం ఉంటుందని దుకాణం యజమాని తెలిపారు. అయితే పోలీసుల విచారణలో 10 కేజీల వెండి ఆభరణాలకు సంబంధించి బిల్లులు చూపాలని పోలీసులు కోరారు. బిల్లులు లేనివి కేసులో నమోదు చేయడం కుదరదని బిల్లులు ఉన్న 4 కేజీల వెండి అలాగే 15 గ్రాముల బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో దుకాణంలో చోరీ విఫలం
ఖాజీపేట బస్టాండ్ కూడలిలోని మదీనా బంగారం దుకాణంలో చోరీ యత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. దుకాణం ముందు భాగంలోని సీసీ కెమెరా పగిలి పోవడం, అలాగే బీగాన్ని పగులగొట్టే ప్రయత్నం చేసిన ఆనవాళ్లను దుకాణం యజమాని గుర్తించారు. విషయం పోలీసులకు తెలుపడంతో వాటిని కూడా పోలీసులు పరిశీలించారు.
డీఎస్పీ, క్లూస్ టీం పరిశీలన
చోరీ జరిగిన విషయం తెలిసిన వెంటనే మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్, ఖాజీపేట సీఐ మోహన్ అక్కడికి చేరుకున్నారు. దుకాణంలోకి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని వేలిముద్రలతోపాటు దొంగల సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
10 కేజీల వెండితోపాటు
బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం
బంగారు దుకాణంలో చోరీ
బంగారు దుకాణంలో చోరీ


