సాక్షి, టాస్క్‌ఫోర్స్ : జిల్లా ప్రజలకు వైద్య వరప్రదాయినిగా పేరు పొందిన కడప జీజీహెచ్ (రిమ్స్) రోగులకు, వారి సహాయకుల పాలిట సౌకర్యాల కల్పనలోనూ, అందించాల్సిన వైద్య సేవలలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. కడప రిమ్స్‌లో ప్రతి రోజూ ఓపీ సమయం 9 గంటలకు ప్రారంభం కాకమునుపే అక్కడ వైద్య సేవలను పొందేందుకు వస్తున్న రోగులకు, వారి సహాయకులకు ఓపీ చీటీలను అందించాల్సిన అవసరం ఉంది. ఓపీ చీటీలను తీసుకునే ముందు ప్రస్తుతం కుటుంబంలోని సభ్యులంతా తమతమ ‘అండ్రాయిడ్’ఫోన్‌ల ద్వారా రిజిస్టర్ చేయించుకునే ప్రక్రియ ‘ఏబిహెచ్‌ఏ’ను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను ప్రతి రోజూ అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది లేదా వివిధ కేటగిరిల వైద్య విద్య అభ్యసించే విద్యార్థులచేత నిర్వహించేవారు. ఈ ప్రక్రియను సోమవారం ప్రత్యేకంగా సెక్యూరిటీ, మహిళా సెక్యూరిటీ సిబ్బందిచేత నిర్వ హింపచేశారు. ఓపీ విభాగంలోని కౌంటర్‌లో ఉద యం 9:12 నిమిషాలైనా కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే విధులను నిర్వహిస్తున్నారు. రోగులు, వా రి సహాయకులు క్యూలైన్‌లలో గంటల తరబడి వేచి వుండటంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
● జీజీహెచ్ (రిమ్స్)కు వైద్య పరీక్షలకు వస్తున్న రోగులకు వైద్య పరీక్షలతో పాటు ఎక్స్‌రే, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలే కొందరు ‘చిరుద్యోగుల పాలిట’వరంగా మారుతున్నాయి. సిటీస్కానింగ్, ఎంఆర్‌ఐ పరీక్షలకు తమను సంప్రదిస్తున్న వారి పరిస్థితిని బట్టి రూ.1000 నుంచి 2000లను అక్షరాలా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
● వేసవి కాలంలో రిమ్స్ ఐపీ,ఓపీ విభాగాలకు మధ్యన ఉన్న ఒకే ఒక్క ‘చలివేంద్రం’ఎంతమంది దాహార్తిని తీర్చగలదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రిమ్స్ ఓపీ విభాగంలోని ‘క్యాంటీన్’ను బలవంతంగా మూయించిన అధికారులు మాత్రం మరలా టెండర్ నోటిఫికేషన్ ద్వారా గానీ, లేదా జిల్లా కలెక్టర్ అనుమతితో గానీ తిరిగి ప్రారంభించకుండా ‘మీన మేషాలు’లెక్కిస్తున్నారు. మరోవైపు సందిట్లో సడేమియా మాదిరిగానే ఐపీ విభాగం ముందు ఉన్న కొందరు క్యాంటీన్ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఓపీ, ఐపీ విభాగాలకు, రిమ్స్ అవసరాలకు కార్పొరేషన్ నుంచి ప్రతి రోజూ ‘లక్ష గ్యాలన్’ల నీటిని సరఫరా చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కార్పొరేషన్ సంస్థకు, రిమ్స్‌కు ఒప్పందం కుదిరింది. కమిషనర్‌లు మారుతున్నారే తప్ప రిమ్స్ అవసరాలకు నీళ్లు మాత్రం సరఫరా కావడం లేదని, కనీసం నాలుగు రోజులకు ఒకసారైనా నీళ్లు రావడం లేదని వాపోతున్నారు.
● మరోవైపు బోర్ల ద్వారా వచ్చిన నీటిలో ‘ఫ్లోరైడ్’ ఎక్కువ శాతం వుండటంతో వార్డులకు, ఓపీ విభాగాలలోని టాయిలెట్స్‌కు, వాష్ బేసిన్‌లకు, ఇతర అవసరాలకు వచ్చే నీటి సరఫరా సక్రమంగా జరగడంలేదు. ఏది ఏమైనా నీటి సౌకర్యం, ప్రజల దాహార్తి రోజురోజుకు శాపంగా మారుతోంది. ఇప్పటికై నా రిమ్స్ వైద్య సిబ్బందికి, ప్రజలకు ఉపయోగపడేలా ‘ఆర్.ఓ.ప్లాంట్’లను ఏర్పాటు చేయాలని, లేకుంటే, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ‘చలివేంద్రాలు’ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఓపీ విభాగంలో అరకొర సిబ్బంది.. సమయపాలన నిల్!
ఇ– హాస్పిటల్ విధివిధానాలకు తూట్లు
సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలకు సైతం అక్రమ వసూళ్లు
దాహార్తితో ఇబ్బందులు పడుతున్న రోగులు, సహాయకులు
ఓపీ క్యాంటీన్‌ను బలవంతంగా మూసివేయించిన అధికారులు
రిమ్స్‌లో ‘అసౌకర్యాల ‘తిష్ట’!
రిమ్స్‌లో ‘అసౌకర్యాల ‘తిష్ట’!
రిమ్స్‌లో ‘అసౌకర్యాల ‘తిష్ట’!


