ఈత సరదా.. ప్రాణం తీసింది
అట్లూరు : సోదరుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలిక తేజశ్విని(14) నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు.. బంధువుల వివరాల మేరకు.. అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన చిట్టిబోయిన సిద్దయ్య(శివప్రసాద్), సుబద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి ద్వితీయ కుమార్తె తేజశ్విని తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పొలాలకు వెళ్లింది. పొలం సమీపంలో ఉన్న కమలకూరు ఆనకట్ట వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో సరదాగా ఈత కొట్టాలని అనుకుంది. తమ్ముడు నానితో కలిసి ఆనకట్ట వద్దకు వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల సాయంతో నీటిలోకి దిగింది. ప్రమాదవశాత్తూ డబ్బా ఊడిపోయి అక్క నీట మునగడం చూసిన తమ్ముడు నాని కుటుంబీకుల వద్దకు వెళ్లి చెప్పారు. వారు హుటాహుటిని వచ్చి చూసేలోగా తేజశ్విని మృతిచెందిందని ఆమె బంధువులు తెలిపారు. అంతకుముందు అందరితో కలిసి సామూహికంగా బోజనం చేసి ఈతకు వెళ్లిన కుమార్తె ఇంతలోనే మృతిచెందడంతో తల్లి తండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.


