‘వక్ఫ్’బిల్లుపై సుప్రీంలో పిల్
జమ్మలమడుగు రూరల్: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పలువురు పీఠాధిపతులు సుప్రీంకోర్ట్‌లో పిల్ దాఖలు చేశారు. గురువారం కదిరి కుటాగుళ్లకు చెందిన సయ్యద్ ఖాజా ఉబేదుల్లా హుసేని (సజ్జాదే నషిన్), జమ్మలమడుగు అస్థాన ఏ గౌసియా పీఠాధిపతి తరుపున ఆయన కుమారుడు సయ్యద్ షా తాహీర్ పీరా ఖాద్రీలు వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్‌ను వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు.
యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
కడప సెవెన్‌రోడ్స్: ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన, అలాగే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నామని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి.నారాయణయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉండాలన్నారు. విద్యార్థులు తమ బయోడేటా, మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, ఫొటోలను జతపరిచి పంపాలన్నారు. ఇతర వివరాలకు 94408 49234 , 94406 51405 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేడు సిద్దవటం కోటలో
వారసత్వ దినోత్సవం
సిద్దవటం: సిద్దవటంలోని మట్లిరాజుల కోటలో శుక్రవారం ప్రపంచ వారసత్వ దినత్సోవం నిర్వహించనున్నట్లు జిల్లా పురాతత్వ సర్వేక్షణాధికారి డాకారెడ్డి తెలిపారు.సిద్దవటం కోటను గురువారం ఆయన సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యేవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. చారిత్రక కట్టడాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ, ఎంటీఎస్ సిబ్బంది స్వరూప్‌రామ్, నందకిషోర్, నాగేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో ఆర్టీ –2009 ప్రకారం ఉచిత ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాల్లో ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఐదేళ్లు నిండిన వారికే 1వ తరగతిలో మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీఎస్ సిలబస్ ఉన్న పాఠశాలల్లో ప్రవేశానికి 31వ తేదీ మార్చి 2025 నాటికి 5 ఏళ్లు నిండి ఉండాలన్నారు. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి జూన్ 1వ తేదీ 2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పారు. ఈ నెల 28నుంచి మే 15వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 18004258599 అనే టోల్ ప్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
అధ్యాపకుల సంఘం
ఎన్నిక ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అద్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామక్రిష్ణారెడ్డి వరుసగా ఏడవ సారి ఎన్నికయ్యాడు. అలాగే ఉపాధ్యక్షుడిగా నరసింహులు, సెక్రటరీగా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా రవీంద్రరెడ్డి, ట్రెజరర్‌గా రమణయ్య, మహిళా కార్యదర్శిగా విజయలక్ష్మి, స్టేట్ కౌన్సిలర్లుగా సాయినాధ, పద్మావతిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
‘వక్ఫ్’బిల్లుపై సుప్రీంలో పిల్


