● బుగ్గవంక పనుల టెండర్లు రద్దు చేయాలి
కడప కార్పొరేషన్: బుగ్గవంకను అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ శాఖ నిర్వహించిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుగ్గవంకలో జంగిల్ క్లియరెన్స్, గుర్రపుడెక్కను తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.3.25 కోట్లతో పది భాగాలుగా విభజించి టెండర్లు పిలిచారన్నారు. ఇందులో తక్కువకు టెండరు వేసిన కాంట్రాక్టర్‌ను బిల్లులు రాకుండా చేస్తామని, విజిలెన్స్‌తో విచారణ చేయిస్తామని బెదిరించారన్నారు. అతనితోనే ఈ పనులు చేయలేనని లెటర్ తీసుకొని, ఎక్కువ మొత్తానికి టెండర్ వేసిన వారికి పనులు అప్పగించారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు లబ్ధ్ది చేకూర్చడానికే ఎస్‌వీఎస్ కన్‌స్ట్రక్షన్ వారికి వర్క్‌ను కట్టబెట్టారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఈ పనులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014–19లో కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి నీరు–చెట్టు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన పనులను కడప నగరంలోని బుగ్గవంకలో చేసి ఆ పనులకు ఇప్పుడు బిల్లులు నమోదు చేస్తున్నారన్నారు. అలాగే కడప నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైద్యులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామక్రిష్ణారెడ్డి, శ్రీరంజన్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.


