ఉన్నత చదువుకు తొలిమెట్టు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇక విద్యార్థులు డిగ్రీనా, ఇంజినీరింగ్‌నా అనేది తేల్చుకునే సమయం కూడా ఆసన్నమైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్ –2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అవి కూడా ఈ నెల 24వ తేదీకి ముగియనున్నాయి. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులెవరైనా ఉంటే త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఏపీ ఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు అధారంగా జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ ముగిసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏపీ ఈఏసీసెట్–2025ను ఎంపిక చేసకోవాలి. ఏపీఈఏపీసెట్ సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన తేదీలు, సూచనలు తదితర పూర్తి వివరాలు పొందవచ్చు.
దరఖాస్తుకు ధ్రువపత్రాల
వివరాలు తప్పని సరి..
ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పని సరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, పీహెచ్‌సీ కేటగిరిల వారిగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో క్లిక్ చేయాలి. అదే విధంగా ధ్రువపత్రాలకు సంబంధించిన నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రవపత్రాలు నంబర్‌ను సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రుపత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు.
స్థానికత నిర్ధారణకు...
విద్యార్థులు స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యా సంస్థల్లో చదివాడు, ఏ ఊరిలో చదివాడనే వివరాలు ఆయా విద్యా సంవత్సరాల వారిగా నమోదు చేయాలి. చివరలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సొంత జిల్లాకు చెందిన విద్యార్థి తమ సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతర కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారిగా ఆయా జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.
దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత..
ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్‌మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్‌టికెట్‌తోపాటు ఆన్‌లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రెఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి. కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుకు
ఈ నెల 24 వరకు గడువు
ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష
మే 19, 20వ తేదీల్లో
అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు
మే 21 నుంచి 27 వరకు
ఇంజినీరింగ్ పరీక్ష
దరఖాస్తు సమయంలో జాగ్రత్తలు తప్పని సరి


