ఇంటికి పోతుండగా పోలీసులు కొట్టారు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : యర్రగుంట్ల పట్టణంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి పోవడానికి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉండగా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ వచ్చి చెప్పేది వినకుండానే చెంపపై కొట్టి, లాఠీతో కొట్టాడని బాధితుడు సింగారపు నీలకంఠ వాపోయాడు. నీలకంఠ బాధతో తనకు జరిగిన దానిపై ప్రచార మాధ్యమాలలో పెట్టాడు. దీనిపై బాధితుడు మాట్లాడుతూ ‘మా ఇల్లు ప్రొద్దుటూరు రోడ్డులోని పెట్రోల్ బంకు వెనుక ఇందిరమ్మ కాలనీలో ఉంది. నేను శనివారం రాత్రి 11 గంటలకు ఇంటి పోవడానికి నాలుగు రోడ్ల కూడలిలో బస్సు కోసం నిలబడి ఉన్నాను. అయితే బస్సు రాకపోవడంతో నా కుమారుడిని బైక్ వేసుకుని రమ్మని ఫోన్ చేసి చెప్పాను. అయితే ఆ సమయంలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు వచ్చి ఏమి ఇక్కడ ఉన్నావే అని అడిగారు. నేను విషయం చెబుతుండగానే నన్ను చెంపపై కొట్టారు.. ఎందుకు కొడుతున్నారని అడిగితే మళ్లీ లాఠీ తీసుకుని చేతి మీద కొట్టారు. రాత్రి సమయంలో ఇంటికి పోవడానికి ఇబ్బందులు పడుతున్న వారిని పోలీసులు దగ్గర ఉండి ఇంటికి చేర్పించాల్సింది పోయి మాపైనే దాడి చేయడం అన్యాయం’ అని బాధితుడు ప్రశ్నించాడు. జరిగిన విషయాన్ని తాను ప్రచార మాధ్యమాలలో పెట్టినట్లు తెలిపారు. అతడు పెట్టిన వీడియో ప్రచార మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీని కలసి తన బాధను చెప్పుకుంటానని, తనకు న్యాయం చేయాలని నీలకంఠ కోరారు.
ప్రచార మాధ్యమాలలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు నీలకంఠ
ఇంటికి పోతుండగా పోలీసులు కొట్టారు


