ఆపరేషన్ కగార్‌ను ఆపాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దండకారణ్యంలో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్‘ పేరుతో ఆదివాసీలపై చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు ప్రసాద్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, విప్లవ రచయిత సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు వరలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఎన్‌ఆర్‌సి, సిఏఏ జేఏసీ కన్వీనర్ బాబు బాయ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరాయ భవన్‌లో జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై నరమేధాన్ని ఆపండి’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అంతమొందించడం తగదన్నారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించ వలసిన బాధ్యత భారత దేశ ప్రజలందరిపైన ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు చెందాల్సిన సహజ వనరులైన అటవీ సంపదను, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆదివాసీ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ముస్లిం మైనార్టీ వ్యతిరేక మతతత్వ విధానాలను తూర్పారబట్టారు. సమాజంలో వివిధ మత సమూహాల మధ్య సామరస్యతను భగ్నం చేయటానికి బీజేపీ యత్నిస్తోందన్నారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. సామాన్య ప్రజల జీవితాలను అభద్రతకు గురి చేస్తూ, అధికారాన్ని కాపాడుకుంటూ, బహుళ జాతి సంస్థలైన అంబానీ, ఆదానీ, ఎస్సార్, వేదాంత లాంటి కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూరుస్తోందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీమలపెంట వెంకటేశ్వర్లు, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ద్రాక్షం శ్రీనివాసులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు.


