దేవ..దేవా.. ఆదాయం స్వాహా ! | - | Sakshi
Sakshi News home page

దేవ..దేవా.. ఆదాయం స్వాహా !

Apr 22 2025 12:18 AM | Updated on Apr 22 2025 12:18 AM

దేవ..దేవా.. ఆదాయం స్వాహా !

దేవ..దేవా.. ఆదాయం స్వాహా !

ప్రొద్దుటూరు : దేవుడు చూడలేడు.. వినడలేడు.. ఏమీ చేయలేడు అని అనుకున్నారేమో కానీ.. దేవదాయశాఖ అధికారులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దేవదాయ సంస్థకు లక్షలాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాశ్రమం దేవదాయశాఖ పరిధిలో ఉంది. సంస్థకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌ అధికారిని నియమించారు అధికార పార్టీ అండతో అధికారులు అక్రమాలకు తెర తీశారు.

● లోకకల్యాణార్థం శ్రీకృష్ణ గీతాశ్రమాన్ని నామా ఎరుకులయ్య ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని గతంలో గంగాధరానంద స్వామి నిర్వహిస్తుండగా అవినీతి ఆరోపణలు రావడంతో 2017లో దేవదాయశాఖ స్వాఽధీనం చేసుకుంది. కరోనా సమయంలో గంగాధరానంద స్వామి మరణానంతరం దేవదాయశాఖ ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌ అధికారిని నియమించింది. గీతాశ్రమంలోని భవనాల్లో అనేక విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. ఇందులో ఎంఎస్‌ శారద జూనియర్‌ కళాశాల ఒకటి. ఇందుకుగాను ప్రతినెల నామమాత్రపు అద్దెను చెల్లిస్తోంది. ఎంఎస్‌ శారద జూనియర్‌ కళాశాల యాజమాన్యం సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ఈ కళాశాలకు భవనాలు లీజుకు ఇవ్వొద్దని గతంలో పనిచేసిన ఈఓ శంకర్‌బాలాజీ లిఖిత పూర్వకంగా దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. 2021 జూలై 31వ తేదీ నాటికి ఎంఎస్‌ శారద జూనియర్‌ కళాశాల లీజు అగ్రిమెంట్‌ పూర్తయింది. తర్వాత అధికారులు బహిరంగ వేలం నిర్వహించాలని ప్రకటించగా తమకు 11 ఏళ్లకు భవనాలు లీజుకు కావాలని కాలేజీ యాజమాన్యం దేవదాయశాఖ అధికారులకు లేఖ రాశారు. అప్పటి వరకు రూ.16,500 బాడుగను రూ.21,945కు పెంచుతూ అధికారులు తీర్మానించారు.

● శ్రీకృష్ణ గీతాశ్రమంలోని 10,998.9 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు అంతస్తుల్లోని భవనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు రూ.88వేలు నెలకు అద్దె చెల్లించాల్సి ఉంది. కేవలం రూ.29వేలతో ఈ భవనాలను అధికారులు అద్దెకు ఇచ్చారు. ఇందులోని మొదటి అంతస్తులో ఉన్న 9వేల చదరపు అడుగుల భవనాలను తమకు అద్దెకు ఇస్తే రూ.60వేలు చెల్లిస్తామని గత ఏడాది సెప్టెంబర్‌ 23వ తేదీన ఒకరు, రూ.80వేలు ఇస్తామని 2021 జూలై 2న మరొకరు దేవాదాయశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వేలం నిర్వహించే సమయంలో తమకు తెలపాలని వారు కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న బహిరంగ వేలం ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్థలకే భవనాలను అద్దెకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి బహిరంగ వేలం నిర్వహించలేదు. ఎవరు పోటీలో పాల్గొనలేదు. లోపాయికారి ఒప్పందం ప్రకారం ఈ భవనాలను ప్రస్తుత ఈఓ రామచంద్రాచార్యులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 మార్చి 7న జారీ చేసిన జీఓ ఎంఎస్‌ నంబర్‌ 37 ప్రకారం స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న ప్రొద్దుటూరులో చదరపు అడుగుకు రూ.8 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదికి రూ.7లక్షల వరకు నష్టం వాటిల్లినట్లయింది.

● ఎంఎస్‌ శారద జూనియర్‌ కళాశాల యాజమాన్యానికే గీతాశ్రమంలోని భవనాలను అద్దెకు ఇవ్వాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గత ఏడాది ఆగస్టు 6న దేవాదాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఆ లేఖ ఆధారంగా కళాశాల యాజమాన్యం లబ్ధి పొందింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ఈఓ రామచంద్రాచార్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు నాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేయడం గమనార్హం. అద్దె భవనాల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

● గతంలో గీతాశ్రమంలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌ రెడ్డి నడవడిక సరిగా లేకపోవడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఈఓ రామచంద్రాచార్యులు విధుల్లో చేరిన తర్వాత జనార్ధన్‌ రెడ్డిని తిరిగి తీసుకుని పెద్దపీట వేశారు. పైగా అతన్ని తొలగించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5లక్షలు వేతన బకాయిలను ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంపై ఈఓ రామచంద్రాచార్యులును వివరణ కోరగా తాను విధుల్లో చేరిన తర్వాత బహిరంగ వేలమే నిర్వహించలేదని, ఎవరిని విధుల్లోకి తీసుకోలేదని తెలిపారు.

తక్కువ అద్దెకు భవనాల లీజు

ఏడాదికి రూ.7లక్షలు నష్టం

ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సిఫారసు

మామూళ్ల మత్తులో

దేవదాయశాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement