దేవగుడి x పోట్లదుర్తి | - | Sakshi
Sakshi News home page

దేవగుడి x పోట్లదుర్తి

Sep 9 2025 8:21 AM | Updated on Sep 9 2025 12:32 PM

దేవగు

దేవగుడి x పోట్లదుర్తి

గండికోటలో పనులు అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఆది వర్గం

ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోట్లదుర్తి నాయకులు

తలలు పట్టుకుంటున్న అధికారులు

టాస్క్‌ఫోర్సు : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు రోజు రోజుకు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ‘పోట్లదుర్తి బ్రదర్స్‌’ ఎక్కడ పనులు చేపట్టిన ఆ పనులు అడ్డుకోవడం దేవగుడి బ్రదర్స్‌లో ఒకరయిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పరిపాటిగా మారిపోయింది. పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం 70 కోట్లకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌లను లెస్‌ వేసి రిత్విక్‌ కంపెనీ పేరుతో పోట్ల దుర్తి బ్రదర్స్‌ దక్కించుకున్నారు. ఇటీవల గ్రామంలో రిత్విక్‌ కంపెనీ గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం యంత్రాలతో వెళ్లారు. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి స్థానిక నాయకులను రెచ్చగొట్టి పనులు అడ్డుకోవాలని సూచించారు. దీంతో స్థానిక నాయకులు పనులకు అడ్డు తగులుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు మొదలు పెట్టగా రెండు సార్లు గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. చేసేదిలేక రిత్విక్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఈ ఇద్దరి వివాదం తలనొప్పిగా మారిపోయింది. సోమవారం గండికోటలో పోలీసు బందో బస్తు మధ్య పనులు చేస్తున్న కంపెనీని సాయంత్రం గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో స్థానికులు పనులు అడ్డుకున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా.. స్థానికంగా ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ అధికారులు వాపోతున్నారు.

గతంలోనూ అంతే..

గతంలో కొండాపురం మండలంలో టి.కోడురు పంచాయతీ పరిధిలో అదాని గ్రూప్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పనులకు ఎంపీ రమేష్‌నాయుడు దక్కించుకున్నారు. ఈ పనులు ప్రారంభించడానికి వెళ్లిన అధికారులపై దాడులు చేసి భయందోళనకు గురి చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది. అనకాపల్లి ఎంపీ రమేష్‌ నాయుడు సీరియస్‌గా తీసుకోవడంతో అధికారులు సైతం అలర్టు అయ్యారు. పనులు చేపట్టడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. అలాగే స్థానిక రైతులకు అదనంగా పరిహారం ఇస్తామన్న హామీని అమలు చేయనందున దానికోసం కంపెనీ ముందు ధర్నా నిర్వహించే విధంగా ఇటీవల దేవగుడి సోదరులు పావులు కదిపారు. సీఎంఓ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు రావడంతో హుటాహుటిన డీఎస్పీ స్థానిక పోలీసులతో వెళ్లి స్థానిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక నాయకులు ధర్నాను విరమించుకున్నారు. అదేవిధంగా ముద్దనూరులో సీఎం సురేష్‌ నాయుడు వర్గం బ్రాందీషాపు చేజిక్కించుకున్నారు. బ్రాందీషాపు ప్రారంభించటానికి రూములు అద్దెకు ఇవ్వకూడదంటూ ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు భయపెట్టడంతో స్థానికులు బ్రాందీషాపులకు రూములు అద్దెకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు బ్రాందీషాపుకు తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అయితే సురేష్‌ నాయుడు అప్పటి ఎస్పీని కలిశారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న అధికారులు కంటైనర్‌లో బ్రాందీషాపును మొదట ప్రారంభింపజేశారు.

స్థానికంగానే అమ్మవారి భూ వివాదం...

పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ అమ్మవారుకు సంబంధించిన భూములు, అభివృద్ధి విషయంలో పోట్లదుర్తి బ్రదర్స్‌, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఎర్పడింది. ఎంపీ నిధులకింద అమ్మవారి ప్రాంగణం అభివృద్ధి చేయాలని సీఎంసురేష్‌ నాయుడు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి విషయంలో పోట్లదుర్తి, దేవగుడి వర్గీయుల మధ్య పనులు విషయంలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తన నియోజకవర్గంలో పోట్లదుర్తి బ్రదర్స్‌ పెత్తనం ఏమిటంటూ ఆదివర్గం, అధికార పార్టీలో ఉన్న తమ పనులే అడ్డుకుంటార అంటూ పోట్లదుర్తి బ్రదర్స్‌ పోటా పోటీ పెత్తనం చెలాయిస్తున్నారు. వీరి మధ్య స్థానకంగా ఉన్న అధికారులు ఎవరికి సర్దుబాటు చేయలేక నలిగిపోతున్నారు. మరి ఉన్నతాధికారులు.. ఆయా పార్టీ పెద్దలు ఎలా ముందుకెళతారో వేచి చూడాలి.

పోస్టర్ల ఆవిష్కరణ

కడప అగ్రికల్చర్‌ : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి నెల రోజుల వరకు ఈ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేడు సమావేశం

కడప ఎడ్యుకేషన్‌ : కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు డీవీఈఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడిజిల్లా అండర్‌ 19 ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చంద్రమోహన్‌రాజు తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ సంబంధించి జిల్లా జట్లను ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మేనేజ్‌మెంట్లకు సంబంధించిన పీడీ, పీఈటీ, ఇన్‌చార్జు పీడీలు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలిపారు. వివరాలకు 9290760996 నంబర్లో సంప్రదించాలని కోరారు.

దేవగుడి x పోట్లదుర్తి 1
1/1

దేవగుడి x పోట్లదుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement