
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో డీఆర్వో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అర్జీల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, ఎస్డీసీ వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ వినతులు
● లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన తోట వెంకటకృష్ణ అనే వ్యక్తి మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఊర్లో ఉన్న తమకు చెందిన భూమిని ఆక్రమించుకొని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని, సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.
● పొద్దుటూరు మండలం నడింపల్లి కి చెందిన షేక్ షాహిన అనే మహిళ భర్తను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నానని, నాకు ప్రభుత్వం మంజూరు చేసే వితంతు పింఛను మంజూరు చేయించాలని అర్జీని సమర్పించారు.
డీఆర్వో విశ్వేశ్వర నాయుడు