ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరాములపేటలోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో గురువారం విజ్ఞాన సేవా సమితి వారి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర క్యాలెండర్‌ను ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ వైద్య విద్యాలయ పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని కాపాడాలనే సంకల్పంతో సామాన్య తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఈ కాలమానిని తయారు చేసిన విజ్ఞాన సేవా సమితి కృషి ని కొనియాడారు. ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్య క్షుడు అంకాల్ కొండయ్య, కోశాధికారి బోగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సుధాకర్, రిజ్వాన్ ఆలీ, షేక్‌షావల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
గేట్ పరీక్షలో ప్రతిభ
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న కేశంరెడ్డి శ్రీవిద్య గురువారం విడుదలైన గేట్ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియాలో 452వ ర్యాంక్ సాధించింది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చంద్ర ప్రతాప్‌రెడ్డి, నాగజ్యోతి దంపతుల కుమార్తె కె.శ్రీవిద్య ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని ప్రతిభపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తతోపాటు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందించారు.


