పోలీస్ కార్యాలయంలో..
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా..
శుభాకాంక్షల వెల్లువ:
● అహంకారాన్ని వీడి..
ధర్మబద్ధంగా జీవించాలి
● కడప కలెక్టరేట్‌లో ఘనంగా
‘శ్రీ పరాభవ నామ’ ఉగాది వేడుకలు
● నలుగురు వేద పండితులకు ఉగాది పురస్కారాల ప్రదానం
● జేసీ నిధి మీనా
కడప సెవెన్‌రోడ్స్: శ్రీ పరాభవ నామ ఉగాది తెలుగు నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జాయింట్ కలెక్టర్ (జేసీ) డాక్టర్ నిధి మీనా ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్‌లో దేవదాయ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరుకాగా, వేద పండితులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అధికారులు అందరూ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని వేడుకలకు నిండుదనాన్ని తెచ్చారు.
సృష్టి రహస్యాలు – పంచాంగ పఠనం
ప్రముఖ వేద పండితులు శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మ పంచాంగ పఠనం చేస్తూ సృష్టి ఆవిర్భావం మరియు ఖగోళ గమనాన్ని వివరించారు. సృష్టికి పూర్వం చీకటితో నిండిన ప్రపంచం ఒక ‘మహా అండం’ నుండి సౌర కుటుంబాలుగా, గ్రహాలుగా ఆవిర్భవించిందని తెలిపారు. ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సరం అంటే మనిషిలోని అహంకారం, గర్వం, స్వార్థం పరాభవం పాలు కావడమని, అరిషడ్వర్గాలను జయించి వినయంతో ఉండాలని ఈ ఏడాది బోధిస్తుందన్నారు. అహంకారంతో ఉండేవారికి ఇది గుణపాఠం నేర్పుతుందని, ధర్మబద్ధంగా ఉండేవారికి అద్భుత విజయాలను అందిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం రాశిఫలాలను వినిపిస్తూ.. ఈ ఏడాది కరవు కాటకాలు లేకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని అంచనా వేశారు.
నలుగురు పండితులకు పురస్కారాలు
సనాతన ధర్మానికి విశేష సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘ఉగాది పురస్కారాలు–2026’ జిల్లాకు చెందిన నలుగురిని వరించాయి. కడపకు చెందిన శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మ, అల్లాడపల్లికి చెందిన శ్రీ భరత్ కుమార్ శర్మ, బద్వేలుకు చెందిన శ్రీ రాజా రమేష్ శర్మ, ఒంటిమిట్టకు చెందిన శ్రీ కె. చంద్రశేఖర్‌లకు జేసీ పురస్కారాలను అందజేశారు. దేవదాయ శాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ.10,116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం మరియు కండువాలతో వారిని ఘనంగా సత్కరించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా ప్రొద్దుటూరు ‘నృత్య తరంగిణి’ బృందం చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు అహూతులను విశేషంగా అలరించాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘ఉగాది కోకిల’ అనే కవితా శీర్షికపై గంగుల రామచంద్రరావు నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను జేసీ సత్కరించారు.
సమానంగా స్వీకరించాలి
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు సంకేతమని, ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు ప్రజలకు సంతృప్తికరంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సభికులందరికీ ఉగాది పచ్చడి మరియు సంప్రదాయ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ సి. శంకర్ బాలాజీ, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, పర్యాటక అధికారి సురేష్, ఏఓ విజయ్‌కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పురస్కారం అందుకుంటున్న విజయ భాస్కర్
కడప అర్బన్: శ్రీ ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ సంబరాల్లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ సంప్రదాయ దుస్తు లు ధరించి హాజరయ్యారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం నిర్వహించగా, ఎస్పీ స్వ యంగా సిబ్బందికి ఉగాది పచ్చడి మరియు మిఠా యిలను పంపిణీ చేశారు. కార్యాలయ ప్రాంగణమంతా తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు సాగాయి.
వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రజలకు, పోలీస్ శాఖలోని ప్రతి అధికారికి మరియు సిబ్బందికి ఎస్పీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, నగరంలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


