బ్లాక్ ఫ్రైడే! | Business Trends | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 17 2013 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడే నమోదయింది. రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కలిసి దేశం వెలుపలికి వెళ్లే నిధులపై ఎక్కడ నియంత్రణలు విధిస్తాయోనన్న భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఉవ్వెత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ఈ అమ్మకాల వెల్లువలో... చిన్నా పెద్దా కంపెనీలని గానీ, ఆ రంగమూ ఈ రంగమూ అని గానీ తేడా లేకుండా అన్నీ పతనం వైపు కొట్టుకుపోయాయి. ఆఖరికి ఈ భయాలు మన కరెన్సీ రూపాయిని కూడా పాతాళానికి తీసుకెళ్లిపోయాయి. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 769 పాయింట్లు పతనం కాగా... చరిత్రలో ఎన్నడూ లేని రీతిన డాలరుతో రూపాయి మారకం ఘోరంగా పడింది. 62 రూపాయలకు చేరింది. ఈ రెండింటి ప్రభావం బంగారంపై పడటంతో దాని ధర ఒక్కసారిగా భగ్గుమంది. ఒకే రోజులో వెయ్యి రూపాయలకు పైగా పెరిగి 31,000 రూపాయలకు చేరువలోకి దూసుకెళ్లింది. సమస్యాత్మకంగా మారిన కరెంట్ ఖాతా లోటుకు పగ్గం వేయడంతోపాటు, నిరవధికంగా పతనమవుతున్న రూపాయి విలువను నిలబెట్టేందుకు అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంకు కొన్నాళ్లుగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. దీన్లో భాగంగానే... విదేశీ కరెన్సీ నిల్వల్ని పొదుపుగా వాడుకునేందుకు బుధవారం ఆర్‌బీఐ కొన్ని చర్యలు ప్రకటించింది. దీన్లో పెట్టుబడుల నిమిత్తం దేశం నుంచి విదేశాలకు నిధులు తరలించకుండా కొన్ని నియంత్రణలూ ఉన్నాయి. అయితే 1991 సంవత్సరానికి ముందున్న తరహా క్యాపిటల్ నియంత్రణలకు ఆర్‌బీఐ తెరతీయవచ్చన్న భయాలు విదేశీ మదుపరులను వెంటాడాయి. గురువారం మార్కెట్లకు సెలవు కావటంతో ఈ నిర్ణయాల ప్రభావం కనిపించపోయినా... శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకోకుండా పతనమవుతూనే వచ్చా యి. చివరికి 769 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ 18,598 పాయింట్ల వద్ద క్లోజయింది. ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ సైతం 234 పాయింట్లు పతనమైంది. ఎఫ్‌ఐఐలు ఒక్క రోజులోనే నికరంగా రూ.562 కోట్ల విలువైన షేర్లను విక్రయించటంతో... గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ ఆర్జించిన 700 పాయింట్లూ ఒక్క రోజులోనే తుడిచిపెట్టుకుపోయాయి. అన్ని రంగాల షేర్లూ కుదేలవటంతో శుక్రవారం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద(లిస్టెడ్ కంపెనీల మార్కె ట్ విలువ) రూ.2 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. మరోవంక డాలర్ల కొనుగోళ్లకు దేశీ మదుపరులు ఎగబడటంతో రూపాయి విలువ చరిత్రాత్మక స్థాయిలో పతనమైంది. ఒకదశలో 62.03ని తాకినా.. బ్యాంకులు జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించటంతో 61.65 వద్ద ముగిసింది. ఇది కూడా కనిష్టంలో కొత్త చరిత్రాత్మక స్థాయే. 31,000 చేరువకు పసిడి దేపనిగా దిగుమతి సుంకాన్ని పెంచుతుండటం... డాలర్ బలపడుతూ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా బంగారం ధర ఉవ్వెత్తున ఎగసింది. గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా 10 గ్రాముల మేలిమి బంగారం 31,050కి పైకి ఎగబాకింది. దిగుమతి సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, రూపాయి మరింత క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో ధర 2 శాతం పెరగడం వంటివన్నీ దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపర్చడం ద్వారా దిగుమతుల్ని తగ్గించుకోగలిగితే రూపాయి బలపడుతుందనే అంచనాలతో ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచుతూ వస్తోంది. అయినా బంగారం డిమాండ్ పెరుగుతోంది. క్రాష్ కారణాలేంటి ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో పెట్టేందుకు వీలుగా ఫెడరల్ రిజర్వ్ నెలకు 80 బిలియన్ డాలర్ల నిధులను బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి విడుదల చేస్తోంది. వీటితోపాటు కొన్నేళ్లుగా రుణాలకు నామమాత్ర వడ్డీని కొనసాగిస్తోంది. దీంతో ఈ పెట్టుబడులు షేర్లు, చమురు, బంగారం తదితర కమోడిటీలలోకి ప్రవహిస్తూ వచ్చాయి. ఫెడ్ వీటిని నిలుపు చేస్తుందని, ఉపసంహరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే వడ్డీ రేట్లూ పెరుగుతాయి. ఫలితంగా విదేశీ నిధుల రాక ఆగిపోవడమేకాకుండా, ఇప్పటికే తరలి వచ్చిన బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వెనక్కు మళ్లుతాయి. తాజాగా చెలరేగిన ఈ ఆందోళనలు ఇన్వెస్టర్లలో భయాలను రేపాయి. ఇవికాకుండా దేశీయంగా... పసిడిబాటలోనే ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై కూడా ప్రభుత్వం నియంత్రణలు విధించవచ్చునన్న అంచనాలు వీటికి జత కలిశాయి. ఇప్పటికే భారతీయులు విదేశాలకు పంపే డాలర్లపై రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించింది. దీనితోపాటు దేశీయ కంపెనీలు చేపట్టే విదేశీ పెట్టుబడులపైనా నియంత్రణలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇవ న్ని అంశాలూ కలగలసి షేర్లతోపాటు, రూపాయిని పడగొట్టాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement