నేటికి సమాజంలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి. వేధించిన వారిని శిక్షించటానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఆకతాయిల ఆగడాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి రైలు నుంచి కిందికి దూకేసింది. విజయవాడకు చెందిన షేక్ హజ్మూలా చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెద్దలు విజయవాడలో పెళ్లి చూపులు ఏర్పాటు చేయటంతో సొంతూరుకు నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది. అయితే, ఆమెను కొందరు ఆకతాయిలు మద్యం సేవిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. వారి చేష్టలను భరించలేక ఆమె ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్ దగ్గర రైలులో నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.