హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఈనెల 1న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ మేల్కొంది. 21 సంవత్సరాల వయస్సు లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు ఆబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు పంపించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు ఆయా బార్ల లెసైన్సులను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్.. ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వయస్సు వారికి మద్యం విక్రయం, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి అంశాలను పునస్సమీక్షించాలని నిర్ణయించారు. అలాగే తమిళ నాడు, కర్ణాటక, కేరళల్లో ఉన్న నిబంధనలు, చట్టాలను అధ్యయనం చేయనున్నారు.