ప్రాణాంతక ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఓ కొత్త, సమర్థమైన హోమియో ఔషధం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు, ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్-బి కారక వైరస్‌ల వ్యాప్తిని నిరోధించే ఈ ఔషధం తయారీపై వీరి పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. రక్తపింజర(క్రొటాలస్ హెరిడస్) విషం ఆర్‌టీ అనే ఎంజైమ్‌ను నిరోధించగలదని వీరు ఇదివరకే శాస్త్రీయంగా నిరూపించారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రథమ ఎస్. మెయింకర్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్‌లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. క్రోటాలస్ హెరిడస్ విషానికి ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు తెలిపారు. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చి, దానిని అభివృద్ధి చేసి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్- బి వంటి వైరస్‌ల బారి నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పరిశోధనలు, సాధించిన ఫలితాల పూర్తి వివరాలను ఈ నెల 11న ముంబైలో జరగనున్న ప్రపంచ హోమియోపతి సదస్సులో వెల్లడించనున్నట్లు తెలిపారు. హోమియోపతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నా, హోమియో మందుల శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల వీటిపై సందేహాలను పటాపంచలు చేయాలన్న ఆలోచనతోనే ప్రపంచ హోమియో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు.
Published Fri, Apr 3 2015 10:10 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement