నాగార్జున యూనివర్శిటీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సోమవారం నాగార్జున యూనివర్శిటీ సందర్శించారు. సమావేశాలు పది రోజులు జరిగే అవకాశముండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లకు అనుకూల వాతావరణం, 175 మంది ఎమ్మెల్యేలతో పాటు అధికారులకు వసతులు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీ డైక్మెన్ హాల్లో అసెంబ్లీ నిర్వహించుకోవచ్చన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు విజయవాడలో వసతి ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్లకు చెరొక రూమ్ కేటాయిస్తామన్నారు. మండలి ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్లకు కలిపి ఒక రూమ్ కేటాయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. ఈ విషయాలన్నింటిపైనా త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం వాస్తు అనుకూలంగా ఉండే గదిని అధికారులు కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే సమావేశాల కోసం మరొక రూమ్ను సిద్దం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర అసెంబ్లీకి హైదరాబాద్‌లోని ప్రస్తుత శాసనసభ ప్రాంగణంలో ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. విభజన అనంతరం తొలి సమావేశాలు, ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు ఈ పాత అసెంబ్లీ భవనంలోనే జరిగాయి. 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీ నిర్వహణకు ఈ పాత అసెంబ్లీ భవనం ఏమాత్రం సరిపోవడం లేదు. సీఎం, మంత్రులకు, ప్రతిపక్ష నేతలకు చాంబర్ల ఏర్పాటుకు సరైన గదులు లేవు. వీటన్నిటికన్నా రాష్ట్రం ఒకచోట ఉండగా అసెంబ్లీ మరోచోట జరుగుతుండడంతో సమావేశాల ప్రాధాన్యత పెరగడం లేదు.
Published Mon, Nov 17 2014 3:30 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement