రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ గోవింద రాజన్ అంగీకరించారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. ఎన్నికల ముందు రైతులు, చేనేత కార్మికుల రుణాలు, డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం అదేనని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణలు చేయడం సాధ్యం కాదని రుణమాఫీ కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా చంద్రబాబు హామీలు ఇచ్చారు. రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులేదు. రిజర్వు బ్యాంకు అంగీకరించలేదు. పాత రుణాలు చెల్లిస్తేగానీ, కొత్త రుణాలు ఇవ్వం అని బ్యాంకులు తెగేసి చెప్పాయి. దాంతో రుణాలు మాఫీ కాస్త రుణాల రీషెడ్యూల్‌కు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుండా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం కల్పిస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి, చెల్లింపునకు గడువు మాత్రమే పొడిగిస్తారు.