పట్టిసీమలో మరో వింత డిజైన్ | Another strange design of pattiseema | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 8 2015 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM

ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా రూ.250 కోట్లు కొట్టేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దలు కలిసి వ్యూహం రూపొందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని వాస్తవ ఖర్చు కంటే భారీగా నిర్ణయించడం, అంచనా వ్యయంపై 21.9శాతం అధికంగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దాని మీద అదనంగా రూ.250కోట్లు కొట్టేయడానికి తాజాగా ‘అత్యాధునిక పరిజ్ఞానం’ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం కుడికాల్వలో పోయడానికి వీలుగా 30 మోటార్లు, 15 వరుసల పైపులైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మెగా మధ్య ఒప్పందం కుదిరింది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్)విధానంలో ప్రాథమిక అంశాల్లో మార్పు చేయకుండా డిజైన్ మార్చుకొనే స్వేచ్ఛ కాంట్రాక్టు సంస్థకు ఉంటుంది. అంచనా వ్యయానికి మించి చేసే అదనపు ఖర్చును ప్రభుత్వం చెల్లించదు. ఈ విషయం ఒప్పందంలోనూ ఉంది.పనులు ప్రారంభానికి ముందే డిజైన్‌ను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆమోదం పొందాలనే నియమం ఉంది. ఇందుకు భిన్నంగా పనులన్నీ పూర్తి చేసి డిజైన్‌ను ప్రభుత్వానికి పంపించింది. ఈపీసీ నిబంధనలను నెట్టి అంచనా వ్యయాన్ని మించి అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement