రాష్ట్ర విభజనపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ అన్నారు. గతంలో అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా చెప్పి, ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్రాకు అనుకూలంగా రాజీనామాల పర్వం కొనసాగుతున్నందున శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై నిర్ణయం అధిష్టానం తీసుకున్నదే తప్ప, తాము తీసుకున్నది కాదని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ నివేదికలో కోరినట్లు బొత్స తెలిపారు. తెలంగాణ అంశంపై తమను దోషిని చేయవద్దన్నారు. ప్రతిపక్షాలతో పలుమార్లు సమావేశం అయిన తరువాతే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని బొత్స గుర్తు చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రా ప్రాంతంలో కలపాలని అధిష్టానానికి విన్నవించామన్నారు. రేపు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలుస్తారని ఆయన అన్నారు.ప్రజలందరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు.