ట్రయల్ రూంలో కెమెరా: స్మృతి ఇరానీకి షాక్! | central-minister-smriti-irani-finds-secret-camera-in-trial-room-of-a-goa-cloth-store | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 3 2015 4:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గోవాలో పెద్ద షాక్ తగిలింది. గోవాలో ఉన్న ఓ స్టోర్లో దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆమె వెళ్లారు. తీరా దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలోకి వెళ్తే.. అక్కడ ఆమెకు రహస్య కెమెరాలు కనిపించాయి. దాన్ని వెంటనే గుర్తించిన ఆమె.. ఆ విషయాన్ని పోలీసులకు అప్పటికప్పుడే తెలియజేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలోనే ఇలా రహస్య కెమెరాలు కనిపించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గోవాలో ఇలా జరగడంతో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. సెలవలు గడిపేందుకు గోవా వెళ్లిన స్మృతి ఇరానీ.. పనజికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలాంగుటె అనే ప్రాంతంలో గల బొటిక్కు వెళ్లారు. తీరా ఆమె కొన్ని దుస్తులు తీసుకుని ట్రయల్ రూంలోకి వెళ్లారు. కాసేపటికి ఆమె సహాయకుల్లో ఒకరు ట్రయల్ రూం వెలుపల ఉన్న కెమెరాను గుర్తించారు. ఆ కెమెరా సరిగ్గా ట్రయల్ రూం లోపలి దృశ్యాలను చిత్రీకరించేలా అమర్చి ఉంది. వెంటనే ఆమె అప్రమత్తమై.. మంత్రికి కూడా విషయం చెప్పారు. ఆమె వెంటనే మైకేల్ లోబో అనే స్థానిక బీజేపీ నాయకుడికి విషయం చెప్పారు. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరంపై పోలీసులు కేసు పెట్టారు. అసలు ఆ కెమెరాను అక్కడ ఎవరు పెట్టారో దర్యాప్తు చేస్తున్నారు. స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను పోలీసులతో కలిసి స్టోర్స్ హార్డ్డిస్కును పరిశీలిస్తున్నానని, గత మూడు నాలుగు నెలలుగా ఈ వ్యవహారం ఆ షోరూంలో జరుగుతున్నట్లు తనకు తెలిసిందని లోబో చెప్పారు. అయితే.. బీజేపీయే అధికారంలో ఉన్న గోవా రాష్ట్రంలో ఇలా జరగడంతో కాంగ్రెస్ నాయకులు దీన్ని 'ఛేంజింగ్ రూం స్కాం'గా అభివర్ణిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement