కొత్త పల్లవి అందుకున్న చంద్రబాబు | Chandrababu Naidu writes to Manmohan Singh | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 10 2013 7:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

తెలంగాణ విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా పది రోజులుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉన్నట్టుండి కొత్త పల్లవి అందుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా నిర్ణయమెలా తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజు చంద్రబాబు కూడా మేల్కొన్నారు. సీఎం చెప్పిన విషయాలనే ప్రస్తావిస్తూ శుక్రవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఆ ప్రాంత పార్టీ నేతలు కొద్ది రోజులుగా అడుగుతున్నా ఒక్కమాట మాట్లాడటానికి వీలులేదంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు. కానీ వారం రోజులుకు పైగా మౌనం తర్వాత సీఎం మాట్లాడగా.. ఆ మరుసటి రోజే బాబు ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల ఆందోళనలకు పరిష్కారం చూపాలని టీడీపీ అధ్యక్షుడు శుక్రవారం రాత్రి ప్రధానికి రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూసి తీవ్రమైన మానసిక క్షోభతో ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని పక్షాలతో చర్చించిన తర్వాతే కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుందని భావించామని, కానీ రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ తన సొంత నిర్ణయంలా భావించిందని విమర్శించారు. విభజన అంశాన్ని 2004 నుంచి తన సొంత కోణంలోనే కాంగ్రెస్ చూస్తోందని పేర్కొన్నారు. 2009లో చేసిన ప్రకటనల వల్ల రాష్ట్రంలో అశాంతి, అనిశ్చితి ఏర్పడిందని, ఆత్మహత్యలకు పురిగొల్పిందని, తాజాగా తీసుకున్న నిర్ణయం సైతం అలాంటి పరిస్థితుల దిశగా సాగేలా ఉందని వివరించారు. కేంద్రం శ్రీకృష్ణ కమిటీ నివేదికను సైతం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ అనుకూల లేఖను ప్రస్తావించని బాబు అయితే తెలంగాణకు అనుకూలంగా 2008లో టీడీపీ తీర్మానం చేసి లేఖ పంపిన విషయం ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవానికి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకోవడానికి రెండురోజుల ముందు కూడా తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఆయన మాటమాత్రంగానైనా లేఖలో వివరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సమన్వయ కమిటీ గత నెల 30న నిర్ణయం తీసుకున్నాయి. ఆరోజు రాత్రి మీడియాతో మాట్లాడతానని తొలుత సమాచారం పంపిన చంద్రబాబు తర్వాత మనసు మార్చుకుని మొహం చాటేశారు. 31వ తేదీన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మాట్లాడారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని చెప్పారు. ఆ విషయాలు కూడా చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించలేదు. తెలంగాణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది ప్రధానికి రాసిన లేఖ అంశాన్నీ మాటమాత్రంగానైనా తాజా లేఖలో గుర్తు చేయలేదు. సీమాంధ్రలో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీవోల సంఘం ప్రతినిధులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేర్వేరుగా చంద్రబాబును కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాననీ, మనవాళ్లు బెంగళూరుకు వెళ్లి అక్కడ బతకడం లేదా? అంటూ ఉద్యోగుల్ని బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీకేం ఇబ్బంది అంటూ చేతులెత్తేసి ఇప్పుడు ఒక్కసారిగా సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఊహించని విధంగా సీమాంధ్రలో ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతుండటం, సీఎం సమైక్యాంధ్ర అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే చంద్రబాబు సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఒలకబోస్తూ కొత్త రాగం అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఊసరవెల్లి: కేసీఆర్ చంద్రబాబు సమయాన్నిబట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దుయ్యబట్టారు. బాబు ప్రధానికి రాసిన లేఖలో తెలంగాణ సమస్యలను, ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను ప్రస్తావించలేదని మండిపడ్డారు. ‘ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణ ఇచ్చారన్న ఆయన మాటలు పచ్చి అబద్ధం. అఖిలపక్ష భేటీలో టీడీపీ పాల్గొనలేదా, అభిప్రాయాలు చెప్పలేదా?’ అని ప్రశ్నించారు. విభజనపై సీఎం స్పందించిన తర్వాత ప్రధానికి లేఖ ఇంతకాలం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పట్టించుకోని టీడీపీ అధినేత అకస్మాత్తుగా రాగం మార్చి సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఒలకబోత

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement