పెను సమస్యగా మారిన రాష్ట్ర విభజన అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం మరోసారి సమావేశం కానుంది. బుధవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో జరిగే ఈ భేటీలో ‘విభజన’ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ కేంద్ర కేబినెట్ ముందు ఉంచాల్సిన నోట్‌ను ఆ తర్వాతే హోంశాఖ సిద్ధం చేస్తుందని సమాచారం. ఒకవేళ భేటీలో ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో నోట్ తయారీ కూడా కోర్ కమిటీ తదుపరి భేటీ దాకా వాయిదా పడవచ్చని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ‘కోర్ కమిటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే హోం శాఖ నోట్ తుది రూపు దిద్దుకుంటుంది. ఆ తర్వాత అది కేంద్ర న్యాయ శాఖకు వెళ్తుంది. అక్కడి నుంచి కేబినెట్ ముందుకు వెళ్తుంది’ అని ఆ వర్గాలు గుర్తు చేశాయి. విభజన ప్రక్రియపై ముందుకెళ్లడంలో ‘హైదరాబాదే’ ప్రధాన అవరోధంగా మారిందని చెప్పుకొచ్చాయి. వెనకా ముందూ ఆలోచించకుండా, కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా తీసుకున్న విభజన నిర్ణయం క్రమంగా కాంగ్రెస్ పాలిట పెను సమస్యగా పరిణమిస్తోందని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఎలాంటి కసరత్తూ చేయకుండానే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హడావుడిగా ప్రకటించడం, అప్పటినుంచీ సీమాంధ్ర అగ్గి మీద గుగ్గిలమై రగులుతుండటం తెలిసిందే. నిజానికి కోర్ కమిటీలో చర్చించిన మీదటే విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ప్రకటించింది. కానీ సీమాంధ్ర ప్రజల సందేహాలు, ఆందోళన నివృత్తి కోసమంటూ పార్టీపరంగా వేసిన ఆంటోనీ కమిటీతో లాభం లేదని తేలిపోవడంతో విభజన అంశం కాస్తా ఇప్పుడు మళ్లీ కోర్ కమిటీ కోర్టుకే చేరినట్టయింది! దాంతో సమస్యను ఎలా పరిష్కరించాలో ఎటూ పాలుపోక కాంగ్రెస్ అధిష్టానం కిందమీదులవుతోంది. ఏదేమైనా సోనియా సమక్షంలో కోర్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాకే దీనిపై ముందడుగు సాధ్యమని ఏఐసీసీ వర్గాలన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఏం చేయాలన్న దానిపై కూడా ఆలోపే స్పష్టత రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాయి. ‘సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్టుగా పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైద్రాబాద్‌ను పరిమిత కాలానికి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలా? లేక శాశ్వత ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ మెట్రోపాలిటన్ అభివద్ధి సంస్థ పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్నీ నగర రాష్ట్రంగా ప్రకటించాలా? అదీ కాదంటే ఢిల్లీ తరహాలో కేవలం శాంతిభద్రతలు, పట్టణాభివృద్ధి, రెవెన్యూ మాత్రం కేంద్ర హోం శాఖ అధీనంలోకి తీసుకుంటే సరిపోతుందా? ఇలాంటి పలు ప్రత్యామ్నాయాలను లోతుగా చర్చించాకే కోర్‌కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. హైదరాబాద్ విషయంలో రెండు, మూడు ప్రత్యామ్నాయాలున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేబినెట్ నోట్ తయారీని నెలాఖరులోగా పూర్తి చేయాలన్న అధిష్టానం ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కత్తిమీద సామే రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉండేలా హైద్రాబాద్‌ను నగర రాష్ట్రంగా ప్రకటించాలన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల డిమాండ్‌కు తెలంగాణ నేతలు ససేమిరా అంటుండటంతో ఈ చిక్కుముడిని విప్పే ఫార్ములాపై ఆంటోనీ కమిటీ కసరత్తు చేస్తోందని ఏఐసీసీ వర్గాలన్నాయి. అయితే అంతిమంగా ఈ విషయంలో కూడా నిర్ణయాన్ని సోనియాకే వదిలేసే అవకాశం లేకపోలేదని అవి వివరించాయి. నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని చేయాలన్నా ముందు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించక తప్పదని, అందుకు రాజ్యాంగ సవరణ అవసరమౌతుందన్న వాదన కూడా ఉంది. ఈ నేపధ్యంలో సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చి, అన్ని ప్రాంతాల ప్రజలకూ ఆమోదయోగ్యమైన మధ్యే మార్గ పరిష్కారాన్ని కనుగొనడం అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైందని కాంగ్రెస్ నేతలంటున్నారు. రాజధానితో పాటు నదీజలాల పంపిణీపై ట్రిబ్యునల్‌కు బదులుగా ఒక చట్టబద్ధ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ నేతలు అంగీకరిస్తారా అన్న సంశయం కూడా ఉందని వారు చెబుతున్నారు.
Published Thu, Sep 12 2013 7:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement