ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు టీ సర్కార్‌పై చేయనున్న కౌంటర్ ఎటాక్‌కు ఏపీ నేర పరిశోధన విభాగాన్ని (సీఐడీ) ప్రధాన ఆయుధంగా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని బుధవారం అధికారికంగా సీఐడీకి అప్పగించారు. మత్తయ్య న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి ప్రముఖులపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్ కింద చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు సీఐడీ పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు.