అది ఈకే 521 ఎమిరేట్స్ విమానం.. 282 మంది ప్రయాణికులు.. 18 మంది సిబ్బందితో తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరింది.. ఎయిర్‌పోర్టు వచ్చేసింది.. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయింది.. ఇంతలో ఒక్కసారిగా దట్టమైన పొగలు.. ప్రయాణికుల గుండెలు జారిపోయాయి.. ఇక అంతే అనుకున్నారు.. కానీ విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన స్పందించారు.. విమానాన్ని చుట్టుముట్టి నిమిషాల వ్యవధిలో అందరినీ దింపేశారు.. వారంతా అలా దిగారో లేదో విమానం భగ్గున మండుతూ పేలిపోయింది.. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగిపోయేది..! ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నా వారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ హఠాత్పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.