ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీపై కేంద్రం కోత విధించింది. 2015–16కు వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా ప్రస్తుతం దీనిని 8.65 శాతానికి తగ్గించింది. గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. స్వల్ప మిగులు కారణంగా వడ్డీ రేటు తగ్గించాల్సి వచ్చిందని భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. 2016–17 సంవత్సరా నికి గాను ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడిక్కడ చెప్పారు. ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 215వ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.