ఆత్మాహుతి బాంబు పేలుడుతో పాకిస్తాన్ నెత్తురోడింది. ఐసిస్ ఉగ్రఘాతుకంతో సింధ్ రాష్ట్రం సెహ్వాన్ పట్టణం రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో ఐసిస్ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో 70 మంది మరణించగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలో పాకిస్తాన్ లో ఐదు బాంబు పేలుళ్లు జరగగా... ఇదే అత్యంత తీవ్రమైంది. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారని, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ప్రమాద స్థలం భీతావహ వాతావరణాన్ని తలపించిందని సీనియర్ ఎస్పీ తారిఖ్ విలాయత్ చెప్పారు.