ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలన్నా, విజన్ డాక్యుమెంట్లన్నా ఈ రాష్ట్ర ప్రజలకు చాలా భయం అని వైఎస్ఆర్ సిపి ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఇలాంటి పత్రాలు విడుదలచేసినప్పుడు కొత్త పన్నులు వేసేవారని, ప్రపంచ బ్యాంకు షరతులను అమలుచేసేవారని చెప్పారు. చంద్రబాబు విజన్ 2020 పెద్ద బోగస్ అని కొట్టిపారేశారు. వీటన్నింటి పేరుపై సంక్షేమ కార్యక్రమాలను కుదించే ప్రయత్నాన్ని ఆయన చేస్తారన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. విజన్ డ్యాంక్యుమెంట్ల పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీనికి వేరే వారు కారణమని చంద్రబాబు చెప్తున్నారని విమర్శించారు. 30 సంవత్సరాలుగా ఆయన వివిధ హోదాల్లో ఉన్నారని, అలాంటి చంద్రబాబు తన ముందు ఏదో కొత్త పరిస్థితి ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ అమలును కూడా నీరుగారుస్తారనే అనుమానం తమకు ఉందన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలియనివికావన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని గుర్తు చేశారు. ఆయన వైఎస్సార్‌సీపీని నిందించడం మానుకొని, చిత్తశుద్ధితో పనిచేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి సలహా ఇచ్చారు.