తొలిదశ పోలింగ్ ప్రశాతం | First Phase of Polling Peaceful says Naveen Mittal | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 23 2013 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు తొలిదశ పోలింగ్ చదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల పోలింగ్ మందకోడిగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిచుకోలేకపోయారు. మొదటి దశలో మొత్తం 6,863 గ్రామ పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో 800 పంచాయతీలకుపైగా ఏకగ్రీవం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా 237 గ్రామ పంచాయతీల ఎన్నికలు వాయిదా వేశారు. 5,803 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ వెల్లడించారు. వివిధ కారణాల వల్ల 13 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. మొత్తం 5790 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈరోజు పోలింగ్ జరిగింది. గుర్తులు తప్పు కారణంగా కృష్ణా జిల్లా సోమవరం, విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లెలో ఓటర్ల లిస్టులో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అభ్యర్థనను పట్టించుకోకుండా కాంగ్రెస్‌కు తహసీల్దార్‌ అండగా నిలవడం విమర్శలకు దారితీసింది. దీంతో పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా గుండారంలో బ్యాలెట్ పేపర్‌లో గందరగోళం చోటు చేసుకుంది. పోటీలో నలుగురు అభ్యర్థులున్నా బ్యాలెట్ పేపర్‌లో మూడే గుర్తులు కేటాయించడంతో గందరగోళం తలెత్తింది. దీంతో 4వ వార్డు ఎన్నిక నిలిపివేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లిలో బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు తారుమారు కావడంతో 4,5 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎన్.కొత్తపల్లిలో కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ మద్దతుదారుడు బాల వెంకటరెడ్డి సహా ముగ్గురిపై కాంగ్రెస్ నేతలు వేటకొడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడులో పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయగిరి మండలం చిట్టెంపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రూరల్ మండలం మాధవరం బూత్ వద్ద ఘర్షణ పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొమడవోలు వీవీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చింతలపూడిలో ఓటర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పోలింగ్ కేంద్రం వద్ద రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గుండారంలో నలుగురు అభ్యర్థులున్నా బ్యాలెట్ పేపర్‌లో మూడే గుర్తులు ఉన్నాయి. దాంతో 4వ వార్డు ఎన్నిక నిలిపివేశారు. చిత్తూరు జిల్లా వేదాంతపురం పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పోలింగ్ కేంద్రం వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోశాడు. పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో ఎన్నికల అధికారికి ఫిట్స్ రావడంతో స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో అప్పపల్లి గ్రామస్తులు ఓటేసేందుకు వెళ్లలేకపోయారు. వివిధ కారణాల వల్ల పోలింగ్ నిలిచిపోయిన పంచాయతీలలో ఆయా జిల్లాల కలెక్టర్ల సమాచారం మేరకు రేపు రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement