ముచ్చటగా మూడోసారి జీవోఎం భేటీ | GoM's Third and Key Meet Today | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 7 2013 1:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

రాష్ట్ర విభజన కోసం ఏర్పడ్డ మంత్రుల బృందం (జీవోఎం) మరికాసేపట్లో సమావేశం కాబోతున్నది. ముచ్చటగా మూడోసారి జరగబోతున్న ఈ సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన విభజన నివేదికలను పరిశీలించనున్నారు. దీని తర్వాత రాజకీయపార్టీలతో నేరుగా ఈ నెల 12న సమావేశమై వారి సలహాలు సూచనల్ని మంత్రుల బృందం స్వీకరించనున్నది. విభజనలో పాలుపంచుకుంటున్న ప్రభుత్వ శాఖలన్నీ తీరికలేకుండా నివేదికలు రూపొందిస్తున్నాయి. తాజా సమాచారంతో నివేదికలను అప్‌డేట్‌ చేయాలని మంత్రుల బృందం సూచించడంతో దానికి అనుగుణంగా శాఖలన్నీ నివేదికలను మంత్రుల బృందానికి అందజేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధి ఆయా శాఖల తరఫున ఆస్తులెన్ని? అప్పులెన్ని? ఉద్యోగులెందరు? వనరులెన్ని ఉన్నాయి?...మొదలైన అంశాలతో రూపొందించిన ఫార్మాట్‌లో శాఖలు నివేదికలు తయారు చేస్తున్నాయి. ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే సమైక్యవాదుల డిమాండ్లను ఖాతరు చేయని కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళుతోంది. విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్‌, టిడిపి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదనే విషయం తెలిసిందే. దాంతో సీమాంధ్ర ప్రాంతం ఉద్యమవేడితో రగిలిపోతోంది. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేందుకు భారీ ప్యాకేజి ఇవ్వనున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. విభజనను స్వాగతిస్తూ కొత్త రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు నిధులు అడిగిన విషయం తెలిసిందే. మంత్రుల బృందంలోని ఏడుగురు మంత్రులు ఇప్పటికే పని విభజన చేసుకొని ఆయా శాఖల కార్యదర్శులతో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసే యంత్రాంగంపైనా, శాంతిభద్రతల పరిస్థితిపైనా టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చిన నివేదికను జీవోఎం పరిశీలనకు తీసుకోనుంది. విభజన సమస్యల్లో మరో ప్రధాన సమస్య జలవనరుల పంపిణీ. దీనిపై చట్టబద్దమైన వాటర్‌ బోర్డును ఏర్పాటు చేసే విషయంపై ఓ నిర్ణయానికి రానున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాల్లో న్యాయం కోసం ఉద్దేశించిన ఆర్టికల్‌ 371 డి..లాంటి అంశాలపై న్యాయశాఖ ఇచ్చే సలహాలు స్వీకరించనున్నారు. 371 డిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలనే ప్రతిపాదనలుఎలానూ ఉన్నాయి. వీటికి జీవోఎం పచ్చజెండా ఊపే అవకాశముంది ఇక విద్యుత్‌ పంపిణీపై కేంద్ర విద్యుత్‌శాఖ చేసిన ప్రతిపాదనల్ని చర్చించనున్నారు...ఈ సమావేశం తర్వాత జరగబోయే మరో ప్రధాన కార్యక్రమం ఈ నెల 12న రాష్ట్రానికి చెందిన రాజకీయపార్టీలతో మంత్రుల బృందం భేటీ అవుతోంది. ఈ భేటీలో ఆయా పార్టీల సూచనల్ని నేరుగా స్వీకరించాలని నిర్ణయించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement