షర్మిలను కలవలేదు, మాట్లాడలేదు: ప్రభాస్ | Hero Prabhas Press Note Condemns Rumors | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 15 2014 4:24 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని సినీ హీరో ప్రభాస్ స్పష్టం చేశారు. షర్మిలపై కొంత కాలంగా కొన్ని వెబ్సైట్లలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారం అంతా నిరాధారం అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ షర్మిళను తానెప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని ప్రభాస్‌ తెలిపారు. ఈ ప్రచారంలో అణువంత కూడా నిజం లేదన్నారు. కొన్నాళ్లుగా ఈ రూమర్లను తాను పట్టించుకోలేదని తెలిపారు. అయితే ఇవి మరో వ్యక్తిని తీవ్రంగా బాధపెడుతున్నాయి. అందుకనే తాను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తికి భార్యగా, ఒక తల్లిగా సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీసేలా ఈ రూమర్లు ఉన్నాయని బాధను వ్యక్తం చేశారు. అందుకే ఈమేరకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన రూమర్లు కారణంగా ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా బాధపడతారో, మనస్తాపం చెందుతారో తాను అర్థంచేసుకోగలనన్నారు. ఈ తరహా రూమర్లకు పుల్‌స్టాప్‌ పెట్టడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తన అనారోగ్యంపై కూడా పుకార్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను కోమాలో ఉన్నట్లు, తీవ్రంగా గాయపడినట్లు ఏవేవో ప్రచారం చేస్తున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఫేస్బుక్లో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు బహిరంగ లేఖ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement