ప్రజలందరూ మెచ్చేలా పరిపాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల మనసులో రాజశేఖరరెడ్డి ఉంటారని... వైఎస్సార్ ప్రజలను సొంతబిడ్డల్లా చూసుకుని పాలన సాగించారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో రెండో దశ మంగళవారం కొనసాగింది. యాత్ర రెండో రోజున షర్మిల మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన ఆమె... అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏం చేశారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను గుండెల్లో పెట్టుకున్న మీరు ఇక్కడికి వచ్చారు. వైఎస్సార్‌పై మీకు ఉన్న అభిమానానికి ఇదే సాక్ష్యం. ప్రజలను సొంత బిడ్డల్లా భావించి భరోసా కల్పించిన వైఎస్సార్... వారి గుండెల్లో రాజన్నగా నిలిచిపోయారు. అందరి అవసరాలకు తగినట్లుగా పాలన సాగించారు. సీఎం పదవిలో ఉన్నవారు ప్రజలను బిడ్డల్లా ప్రేమించాలని రుజువు చేసి చూపారు. అందుకే ఇప్పటికీ రాజన్న ప్రజల్లో ఉన్నారు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఆయన జీవించి ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను మనమే బతికించుకోవాలి. మంచి రోజులు మళ్లీ వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. వైఎస్సార్‌పై అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా..’’ అని షర్మిల పేర్కొన్నారు.