క్రిమినల్ అప్పీళ్లలో బెయిల్ మంజూరుకు సంబంధించి ఇప్పటివరకు పాటిస్తూ వచ్చిన సంప్రదాయాన్ని ఉమ్మడి హైకోర్టు తిరగరాసింది. ఏదైనా నేరంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారు తమ క్రిమినల్ అప్పీల్ పెండింగ్‌లో ఉందన్న కారణంతో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు ఇన్నాళ్లుగా తిరస్కరిస్తూ వచ్చింది. తాజాగా ఆ సంప్రదాయానికి స్వస్తిపలికింది. హత్యనేరం సహా ఏదైనా నేరంలో యావజ్జీవ శిక్షపడి, ఐదేళ్ల శిక్షను అనుభవించిన ముద్దాయిలు.. ఆ శిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసుకున్న అప్పీల్ పెండింగ్‌లో ఉంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారు జైల్లో సత్ప్రవర్తనతోనే ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్లు ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. బందిపోట్లు, రకరకాల ప్రయోజనాల కోసం హత్యలకు పాల్పడినవారు, కిడ్నాపర్లు, ప్రజాసేవకుల హంతకులు, జాతీయ భద్రతా చట్టం పరిధిలోని నేరాలు చేసిన వారు, నార్కోటిక్ డ్రగ్స్ కేసులో శిక్షపడినవారికి మాత్రం బెయిల్‌పై విడుదలయ్యేందుకు అర్హత లేదని తేల్చి చెప్పింది.