పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న సొమ్ములో నల్లధనాన్ని బయటికి లాగేందుకు కఠిన చర్యలు ప్రకటించింది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికంటూ మరో అవకాశమిచ్చింది. ఇందుకోసం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సవరణలు చేస్తూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పెద్దనోట్లు రద్దయిన తర్వాత నుంచి బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లలో.. ఆదాయ వివరాలను వెల్లడించని మొత్తాన్ని ప్రజలు డిసెంబర్ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటిస్తే... దానిపై 50 శాతం వరకూ పన్ను (జరిమానా, సర్‌చార్జీతో కలిపి) చెల్లించి బయటపడొచ్చని కేంద్రం ప్రకటించింది.