ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతుందని వైఎస్సార్‌సిపి నాయకురాలు కొండా సురేఖ అన్నారు. తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి వెంటనే స్పష్టం చేయాలని ఆమె శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని ఆమె కోరారు. కాగా పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై తమ అభ్యంతరాలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దృష్టికి తెచ్చామని పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ విజయమ్మతో వారు శుక్రవారం భేటీ అయ్యారు. మొత్తం వ్యవహారం పార్టీ అధ్యక్షుడి దృష్టి తీసుకెళ్లినట్టు తెలిపారు. సాయంత్రం మరోసారి వైఎస్ విజయమ్మతో తాము భేటీ అవుతున్నామని జిట్టా బాలకృష్ణా రెడ్డి తెలిపారు. కాగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ సీట్లు, ఓట్ల రాజకీయంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తమ రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్‌కు పంపించిన విషయం తెలిసిందే.