తన తల్లి భూమా శోభానాగిరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తెలిపారు. తనపై వైఎస్సార్ సీపీతో పాటు, ఆళ్లగడ్డ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సోమవారం లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తండ్రి నాగిరెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. అమ్మ ఆశయాలు కోసం పని చేస్తానని ఆమె తెలిపారు. ఆళ్లడగ్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అఖిలప్రియ అన్నారు. ఈ అవకాశం కల్పించిన జగన్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, శోభా మరణం ఇప్పటికీ బాధగానే ఉందని భర్త నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.