అడ్డంగా దొరికిపోయిన జగ్గారెడ్డి | mla jaggareddy boobked for police | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 13 2014 8:00 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సెల్‌ఫోన్లు, ఖరీదైన వస్తువులు పంచుతూ ఎన్నికల అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, కార్యకర్తలతో ఆయన శనివారం ఇక్కడి గన్‌రాక్ గార్డెన్‌లో సమావేశమయ్యారన్న సమాచారంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుంది. ఆ సమయంలో మహిళలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి చర్చిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించిన కార్యకర్తలు, నేతలు ఒక్క ఉదుటన బయటికి లంఘించారు. వీరితో పాటే జగ్గారెడ్డి సైతం బయటికి వెళ్లిపోయారు. వెంటనే గార్డెన్ ప్రధాన ద్వారాన్ని మూసేసిన అధికారులు.. క్షుణ్నంగా తనిఖీలు జరిపి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 80 సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్లకు సంబంధించిన సుమారు 600 ఖాళీ డబ్బాలు, ఎనిమిది మైక్రోవేవ్ ఓవెన్లు, 3 డీవీడీలు, 8 గ్యాస్‌స్టౌవ్‌లు, 8 మిక్సీలు, ఖరీదైన ఎనిమిది మద్యం బాటిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వంటసామగ్రి, వెజిటబుల్ కట్టర్లు, ప్లాస్టిక్ టీపాయ్‌లు తదితరాలు ఉన్నాయి. టీవీ 9 స్టిక్కర్ అంటించిన (ఏపీ 31 టీయూ 839) టవేరా వాహనంతో పాటు పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీపీ మహేందర్, కార్ఖానా, మారేడ్‌పల్లి సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement